Amalapuram issue: కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం వెనుక అధికారపక్ష నాయకులు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వీడియో దృశ్యాల ఆధారంగా పలువురిని ఇప్పటివరకు గుర్తించారు. తొలిగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అధికులు వైకాపాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో భాజపా, తెదేపా, జనసేన నాయకులతోపాటు ఇతరులూ ఉన్నారు. మంత్రి వెంట తిరిగే కొందరు ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనేందుకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
ముమ్మిడివరం ఎమ్మెల్యే నివాసం సమీపంలో సేకరించిన సీసీటీవీ దృశ్యాల్లోనూ వైకాపా కార్యకర్తలు దాడుల్లో పాల్గొన్నట్లు ఆధారాల్లో నిక్షిప్తమైనట్లు తెలుస్తోంది. దీంతో చర్యలకు ముందుకు వెళ్లాలా..? వెళ్తే ఎలా వెళ్లాలనే మీమాంస నెలకొంది. విధ్వంసంలో తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి విశ్వరూప్ బుధవారం వ్యాఖ్యానిస్తూ.. వైకాపా బీసీ కౌన్సిలర్‌తో వీళ్లు నాలుగు రోజులుగా సంప్రదింపులు జరిపారని.. కాల్‌డేటా ఇతర ఆధారాలూ ఉన్నాయనడంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
46 మందిపై ఎఫ్‌ఐఆర్.. అందులో 14 మంది వైకాపా..అమలాపురంలో విధ్వంసంతో రూ.కోట్ల ఆస్తినష్టంతో పాటు.. పలువురు గాయపడ్డారు. ఈ దుశ్చర్య వెనక ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఇప్పటికే నిశితంగా పోలీసులు దృష్టిసారించి.. సాంకేతికత ఆధారంగా గుర్తించే చర్యల్లో కొంతమేరకు స్పష్టతకు వచ్చారు. మంగళవారం నాటి అల్లర్లలో అమలాపురం నల్లవంతెన వద్ద ‘వజ్ర’ వాహనం (ఏపీ 39పి 0020)పైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వాహనం డ్రైవర్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఈనెల 24న ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.