Crop loss Across The State: రాష్ట్రంలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వరి, మొక్కజొన్న పంటలు అలాగే మిర్చి, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జరిగిన నష్టానికి పెట్టుబడైనా వస్తుందో లేదో అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రమంతట జరిగిన పంట నష్టంతో రైతుల బాధలు ఇలా ఉన్నాయి.
జి.కొండూరు-కృష్ణా జిల్లాలోఅకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు...ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో పట్టాలు కప్పి కల్లాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టాల కోసం..30వేల రూపాయల వరకూ ఖర్చు చేశామని వాపోతున్నారు. 20 రోజులుగా కల్లాలవద్దే ఉంటున్నామని..పట్టాలు కప్పినా వర్షానికి ధాన్యం తడిచి మొలకెత్తుతోందని కన్నీటిపర్యంతం అవుతున్నారు.
మైలవరం-ఎన్టీఆర్ జిల్లాలో..అకాల వర్షాలు నట్టేటా ముంచాయని మిర్చి రైతులు... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన మిర్చి పంట తడిసిపోయిందని వాపోయారు. మందులు, కూలీల కోసం...లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టామని...పెట్టుబడైనా వస్తుందో లేదో అర్ధం కావడంలేదని అంటున్నారు.
అకాల వర్షాలతో కృష్ణా జిల్లాలో మామిడి రైతు కుంగిపోతున్నాడు. గాలివానకు మామిడికాయలు రాలిపోతున్నాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో మద్దతు ధర కూడా దక్కడం లేదంటున్నారు.
అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యం, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఆర్బీకే వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నున్న నూజివీడు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.