Crop Holiday: కాలువ కట్టేదెప్పుడు..? విత్తు వేసి...చేను తడిపేదెప్పుడు..? పంట కొంటారు సరే.. తిరిగి డబ్బులిచ్చేది ఎప్పడు..? కోనసీమలో క్రాప్ హాలిడే బాట పట్టిన రైతుల ప్రశ్నలివి..! ఖరీఫ్ దృష్ట్యా.. ప్రస్తుతానికి 50 వేల ఎకరాల్లో.. అన్నదాతలు నాగలికి సెలవిచ్చారు..! ఉద్యమం అబద్ధమంటున్న ప్రభుత్వ పెద్దలు వచ్చి...తమ ఆధ్వర్యంలో సాగు చేసి కష్టాలు తెలుసుకోవాలంటూ.. రైతులు ఆహ్వానించారు.
కోనసీమలో 2011లో పురుడు పోసుకున్న క్రాప్ హాలిడే ఉద్యమం....మళ్లీ తెరపైకి వచ్చింది. లాభం సంగతి పక్కన బెడితే...పెట్టిన పైసా పెట్టుబడీ వెనక్కి రావట్లేదంటూ.. రైతులు తొలకరి పంటకు దూరమవ్వాలని నిర్ణయించారు. పంట వేయడం కన్నా మానుకుంటేనే మేలంటూ...నాగలి వదిలేసి ఇంటికి పరిమితం కావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే.. అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, రాజోలు మండలాలకు చెందిన అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించారు.
రైతు పరిరక్షణ సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో.. రైతులు, కౌలు రైతులు అధికారుల్ని కలిసేందుకు వెళ్లగా.. ఎవరూ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఖరీఫ్ సాగుకు.. 50 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించామని.. రైతు నేతలు అంటున్నారు. మున్ముందు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం నెలలు గడిస్తే గానీ డబ్బు చెల్లించడం లేదని.. రైతులు వాపోయారు. విత్తు వేసినా కూలి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణం ఇప్పిస్తామన్నా.. అసలు మొత్తం పక్కనబెడితే వడ్డీ చెల్లించలేమంటున్నారు.
క్రాప్ హాలిడేపై అంటున్న రైతు మాట అబద్ధమని ప్రభుత్వ పెద్దలకు అనుమానం ఉంటే.. వారే వచ్చి తమ ఆధ్వర్యంలో సాగు చేయాలని సూచించారు. ఆ తర్వాతే వారికి రైతు కష్టాలపై స్పష్టత వస్తుందన్నారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి..ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చిచెప్పారు.
కోనసీమ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం:1,87,500 ఎకరాలు
పంట విరామం ప్రకటించినది:అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 24,000 ఎకరాలు
రైతులు చెబుతున్న ప్రధాన సమస్యలు:
ఖరీఫ్‌లో:భారీవర్షాలు, వరదల కారణంగా మూడేళ్ల నుంచి రైతులు ఘోరంగా నష్టపోతున్నారు. గతేడాది వర్షాలకు కొన్ని మండలాల్లో గింజ కూడా చేతికి రాలేదు. దీనికితోడు డ్రైనేజి వ్యవస్థ పూర్తి అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు ముందుకు పారక.. పొలాలు ముంపు బారిన పడుతున్నాయి.
రబీలో:ఈ సీజన్లో పూర్తిస్థాయి సాగునీరు అందడం లేదు. దీంతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. మిగిలేదేమీ ఉండటం లేదు.
అమ్మకానికీ అవస్థలే:పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఈ-పంట, రైతు భరోసా కేంద్రాల్లో నమోదు, మిల్లర్ల బేరాల వంటివన్నీ దాటుకుని రావాల్సి వస్తోంది. ఇన్ని కష్టాలు పడినా, మద్దతు ధర రూ.1,455 కాగా.. చివరకు రైతుకు దక్కేది బస్తాకు రూ.1,100 నుంచి రూ.1,250 మాత్రమే. ఇక తడిసిన ధాన్యమైతే రూ.వెయ్యి కూడా రాదు. ఈ సొమ్మయినా 2-3 నెలల వరకూ చేతికి అందడం లేదు. ఈలోగా అప్పులపై వడ్డీ పెరుగుతోంది. ఎప్పుడో 2021 ఖరీఫ్‌లో ధాన్యం అమ్మిన కొందరు రైతులకు... 2, 3 రోజుల కిందటే సొమ్ము జమచేశారు. రబీ ధాన్యానికి రూ.475 కోట్లు రావాల్సి ఉంటే.. రూ.25 కోట్లే రైతులకు అందాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకముందే మళ్లీ పంటకాలం మొదలైపోయింది.
పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు:ఖరీఫ్‌లో వరి సాగుకు ఎకరాకు సగటున రూ.40వేల వరకు ఖర్చవుతోంది. కౌలు రూపంలో ఎకరాకు రెండు పంటలకు కలిపి 22-28 బస్తాలు ఇస్తున్నారు. తొలి పంట సక్రమంగా చేతికొచ్చినా.. ఎకరాకు రూ.15వేల వరకు నష్టపోతున్నారు. గతంతో పోలిస్తే డీజిల్ ధరలు 40%, ఎరువుల ధరలు 60% పెరిగాయి. దమ్ము చేయడం, ధాన్యం రవాణా, కోత యంత్రాల వినియోగం వంటివన్నీ పెనుభారంగా మారాయి.
కూలీల సమస్య:వరి సాగు సమయంలో ఉపాధిహామీ పనుల కారణంగా.. కూలీలు దొరకట్లేదు. సమయానికి నాట్లు పడక, కోతలు కోయలేకపోవడంతో.. దిగుబడిపై ప్రభావం పడుతోంది