CM's Visit to Flood Areas గడిచిన నాలుగేళ్లుగా ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వరదలు సంభవిస్తూనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజల వారం రోజులు పాటు వరద నీటిలో అవస్థలు పడుతూనే కుటుంబాలతో ఉన్నారు. వరదల కారణంగా పాడైన రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, విద్యుత్ స్తంభాలు గానీ ఈ నాలుగేళ్లలో అధికారులు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కానీ, ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పన శరవేగంగాజరుగుతోంది. బురదమయమైన లంక భూమిలోకి వెళ్లే కచ్చా రోడ్లు గ్రావెల్ రోడ్లుగా మారిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన సీసీ రోడ్లకు ఇరువైపులా వెడల్పు పనులు చకచకా జరిగిపోతున్నాయి. పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, కూనలంక, లంక ఆఫ్ ఠాణేల్లంక గ్రామాలను వారం రోజుల కిందట చూసినవాళ్లు ఇప్పుడు చూస్తే... వారం రోజులు వరద నీటిలో ఉన్న గ్రామాలేనా అని ఆశ్చర్యకపోక తప్పదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. (CM Jaganmohan Reddy) వరద బాధితులను స్వయంగా కలుసుకునే ప్రాంతాలు, కోతకు గురవుతున్న ఏటిగట్టు పరిశీలించే ప్రాంతాలకు ఇతరులు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Flood Victimsముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Kona Seema District) ముమ్మిడివరం, ఐ పోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలో గల గౌతమీ గోదావరి.. వృద్ధ గౌతమి గోదావరి నదీపాయల వరదల కారణంగా ముంపు బారినపడిన గ్రామాలు, పంట పొలాలు, నదీ కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కి స్వాగతం పలికేందుకు లంక గ్రామాలు ముస్తాబయ్యాయి.గురజాపులంకలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మంగళవారం ఉదయం 10:40గంటలకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. హెలిపాడ్ సమీపంలోనే ఉన్న వరద ప్రవాహానికి కోతకు గురైన లంక భూములు, కుళ్లిపోయిన పంటపొలాలను సీఎం పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు తగిన ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కూనలంక, లంక ఆఫ్ ఠాణేల్లంక గ్రామాలకు చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు.