Chandrababu Fires on CM Jagan in Rachabanda Program: వైసీపీ ప్రభుత్వం... రైతుల పాలిట శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ నిర్ణయాలతో... వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులను అటకెక్కించి... చుక్క నీరు లేకుండా చేశారన్నారు. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో రైతులతో చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై (YCP government) తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టిసీమ దండగ అని దుష్ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు వారికి అదే దిక్కైందని అన్నారు. ఆర్బీకేలాంటి దరిద్రమైన వ్యవస్థను తెచ్చి... రైతులను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి: జగన్ రోజుకో పథకం పేరుతో సొంత పత్రికలో ప్రకటనలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ చేనేత కార్మికులకు(Handloom workers) ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ వచ్చే ఎన్నికల్లో సైతం ప్రజల ముందుకు వచ్చి మళ్లీ అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. గిట్టూబాటు ధర కల్పించకపోవడంతో.. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 250 మంది చేనేత కార్మికులు ఉన్న ఏడిద గ్రామంలో.. సీఎం జగన్ బటన్ నొక్కితే కేవలం 35 మందికి మాత్రమే రూ.24వేలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. మిగితా 215 మంది పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చేనేత వృత్తి చేసే వారి పరిస్థితి దయనీయంగా ఉందని, అలాంటి వారి కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.