ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ప్రభల ఉత్సవాలు.. ఆధ్యాత్మికలో తేలియాడిన భక్తులు

SANKRANTI PRABHALU 2023 : కనుమ రోజున కోనసీమ జిల్లాలో ప్రభల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోటలో ఏకాదశ రుద్ర ప్రభల తీర్థం కన్నుల పండువగా సాగింది. అశేష జనవాహిని ప్రభల తీర్థానికి తరలివచ్చి ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించారు.

SANKRANTI PRABHALU 2023
SANKRANTI PRABHALU 2023

By

Published : Jan 17, 2023, 8:06 AM IST

కన్నుల పండువగా ఏకాదశ రుద్ర ప్రభల తీర్థం.. ఆధ్యాత్మికలో తేలియాడిన భక్తులు

SANKRANTI PRABHALU : సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజున ఏకాదశ రుద్రులు కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోటలో కొలువుదీరతారని భక్తుల విశ్వాసం. ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జగ్గన్నతోటకు తరలివచ్చారు. టన్నుల బరువుండే ప్రభలను సర్వాంగ సుందరంగా అలంకరించి భుజాలపై మోస్తూ.. ఊరేగింపుగా జగ్గన్నతోటకు తీసుకొచ్చారు.

పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రభల్లో కొలువుదీర్చారు. ప్రభలకు శిఖరభాగంలో త్రిశూలం, మధ్యభాగంలో మకర తోరణం ఉన్న మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను ఏర్పాటు చేశారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు గ్రామాలకు చెందిన ప్రభలను పవిత్ర కౌశిక నదీ తీరం దాటించి ఏకాదశరుద్రుల తోటకు చేర్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది ఈ ప్రభల తీర్థం చూడటానికి వచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రభల తీర్థం చాలా అద్భుతంగా ఉంది. పచ్చని పొలాల నుంచి ప్రభ రావడం.. చూడటానికి చాలా బాగుంది. -భక్తులు

వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భేగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వారి రూపాలతో.. మంగళవాయిద్యాలు, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ప్రభలను తీసుకొచ్చారు. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. ఈ అపురూప ఘట్టాలను తిలకించి పరవశించారు.

"మేము ప్రతి సంవత్సరం ప్రభల తీర్థం చూడటానికి వస్తాము. కోనసీమ జిల్లాలో జరిగే ముఖ్యమైమన పండుగ ఇది. జగ్గన్న తోటలో అన్ని ప్రభలు ఒక్కసారే రావడం చాలా ఆనందంగా ఉంది" -భక్తులు

పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ ప్రభల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 150 గ్రామాల్లో 500 ప్రభలు తీర్థాలలో కొలువుదీరాయి. ముమ్మిడివరం పరిధిలోని పల్లెపాలెంలో ప్రభల తీర్థం వైభవంగా జరిగింది.

సలాదివారిపాలెం, కొత్తపేట, రాజుపాలెం, సోమదేవరపాలెం సహా పది గ్రామాల ప్రభలను.. యువకులు భుజాలపై మోసుకుంటూ ప్రధాన రహదారులు, పంట కాలువలు, ఆక్వా చెరువుల మీదుగా పల్లెపాలెం ఉత్సవ ప్రాంతానికి చేర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు.. ప్రభలను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details