రావులపాలెంలో ఉద్రిక్తత.. ఎస్పీ వాహనంపై ఆందోళనకారుల రాళ్ల దాడి - అమలాపురంలో భారీ బందోబస్తు
18:00 May 25
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై రాళ్లు విసిరిన ఆందోళనకారులు
Ravulapalem Tension: కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు.. వెంబడించడంతో ఆందోళనకారులు పారిపోయారు. కోనసీమ సాధన సమితి ఇవాళ చలో రావులపాలెంకు పిలుపునిచ్చింది. అమలాపురం ఘటన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడివారిని అక్కడే నియంత్రించారు. ఎవరు కూడా నిరసన కార్యక్రమాలల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు పట్టణంలో బందోబస్తు చేపట్టారు. కోనసీమ సాధన సమితి సభ్యులు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని నిలువరించారు. బందోబస్తులో భాగంగా పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎస్పీ కారులో వెళ్తుండగా రావులపాలెం రింగ్ సెంటర్ వద్ద కొంత మంది యువకులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైప పోలీసులు యువకులను వెంబడించడంతో వారు పారిపోయారు. ఈ ఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తం అయ్యారు. కొన్ని చోట్ల యువకులు దాగి ఉండొచ్చని.. ఆందోళనకు దిగొచ్చని భావించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం రావులపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: