'సరిగ్గా.. 3 గంటల 10 నిమిషాలకు యుద్ధం మొదలుపెడదాం..! పోలీసులు భోజనం చేస్తున్నారు... అమలాపురం టౌన్‌లోకి రావడానికి ఇదే మంచి సమయం'. ఇవీ.. ఈ నెల 24 న అమలాపురం ఘటనకు ముందు వాట్సప్ గ్రూపుల్లో చెక్కర్లు కొట్టిన సందేశాలు. సంబంధిత ఘటనపై ఆరా మొదలుపెట్టిన పోలీసులకు వాట్సప్ గ్రూపుల్లో పంచుకున్న ఇలాంటి అనేక సందేశాలు కనిపిస్తున్నాయి. ఈ సందేశాలే అమలాపురంలో విధ్వంసానికి కారణమయ్యాయని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వెల్లడించారు. విధ్వంసం కేసులో మరో 25 మందిని అరెస్ట్ చేశామని.. 144 సెక్షన్‌ను మరో 5 రోజులు పొడిగించినట్లు తెలిపారు.
శనివారం అరెస్ట్ చేసిని 25 మందిలో 18 మంది వైకాపా కార్యకర్తలు ఉండటం గమనార్హం. వారిలో ఇద్దరేసి తెదేపా, జనసేన కార్యకర్తలు కాగా.. మిగిలిన వారు సాధారణ పౌరులు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలంయం నుంచి నిత్యం తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. నాలుగు రోజులుగా అమలాపురంలో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. ఇంకా పునరుద్ధరించ లేదు. పాలిసెట్ అభ్యర్థుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శుక్లా తెలిపారు.
అమలాపురం విధ్వంసంలో పాల్గొన్న వారిని పలు విధాలుగా గుర్తిస్తున్నామని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. 20 వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారం పంచుకున్నారని ఎంతమంది ఎప్పుడు ఎక్కడకు చేరుకోవాలనే సందేశాలు ఉన్నాయని తెలిపారు. డిలీట్ చేసిన మెసేజ్‌లనూ సాంకేతికత ఆధారంగా పరిశీలిస్తున్నామని, అరెస్టు చేసిన వారి ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. అమాయకులపై కేసులు పెట్టబోమని, తప్పు చేసని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.