Young Swimmer Avighna: పుట్టింది మనదేశంలో కాదు, పెరిగింది, చదువుకుంటోందీ ఇక్కడ కాదు. కానీ రాష్ట్రానికి, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది.. ఈ స్విమ్మర్ లక్ష్యం. అందుకోసమే ఇక్కడ జరిగే పోటీల కోసం ఒమన్ నుంచి భారత్‌కు వస్తోంది ఈ బాపట్ల అమ్మాయి. రాష్ట్రం తరఫున పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోంది. ఆగస్ట్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరపున బరిలో దిగనుంది.
ఈ స్విమ్మర్ పేరు అవిఘ్న. పుట్టి పెరిగింది ఒమన్ రాజధాని మస్కట్‌లో. ఉద్యోగరీత్యా తండ్రి అక్కడే స్థిరపడ్డారు. ఆరేళ్ల వయస్సులో అవిఘ్న తండ్రితో పాటు ఆఫీసుకు వెళ్లినప్పడు అక్కడ స్విమ్మింగ్ ఫూల్‌ను ఆసక్తిగా గమనించింది. అప్పడే ఆమెలోని ఆసక్తి గమనించిన తండ్రి వినయ్ అదే రంగంలో నుంచి ప్రోత్సహించారు. అందుకే ఆమె ఈ రంగంలో రాణిస్తున్నానని చెబుతోంది.
మస్కట్‌లో యాస్మన్ అనే కోచ్ వద్ద శిక్షణ తీసుకుంది అవిఘ్న. నిరంతర సాధనతో తక్కువ సమయంలోనే ఫ్రీస్టైయిల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్‌ఫ్లై విభాగాల్లో నైపుణ్యం సాధించింది. దేశ, విదేశాల్లో అనేక పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చూపి ఇప్పటికి వరకు 200లకు పైగా పతకాల్ని సాధించింది. ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంటోంది అవిఘ్న.
2017లో ఒమన్‌లో నిర్వహించిన అండర్-18 ఈత పోటీల్లో అద్భుత ప్రతిభతో ఐదు పసిడి పతకాలు గెలుచుకుంది. 2019లో అండర్-10 ఒమన్ కప్ పోటీల్లో పాల్గొన్న అవిఘ్న స్వర్ణంతో ప్రశంసలు అందుకుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఆశతో భారత్‌కు వచ్చి.. 2019-20లో భోపాల్‌లో నిర్వహించిన సీబీఎస్ఈ జాతీయ ఈత పోటీల్లో పాల్గొంది. తొలి ప్రయత్నంలోనే 2 రజతాలు తన ఖాతాలో వేసుకుంది. 2020 ఫిబ్రవరిలో దుబాయ్‌లో నిర్వహించిన మధ్య ఆసియా దేశాల జూనియర్ ఈత పోటీల్లో 3రజతాలు, 3కాంస్యాలతో మెుత్తం 6పతకాలు గెలిచింది. భారత్‌లో జరిగే పోటీలకు వచ్చినప్పుడు ఇక్కడ కోచ్ ఖాజా మెుయినుద్దీన్ అన్ని విధాల సూచనలిస్తున్నారు అని చెబుతోంది.
తాజాగా నర్సరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో 5 బంగారు పతకాలు సాధించింది. 200 మీటర్లు, 100 మీటర్లు, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో 3పసిడి, 100 మీటర్లు, 50 మీటర్ల ఫ్రీస్టైయిల్ విభాగంలో 2 స్వర్ణాలతో ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
క్రీడలంటే ఖర్చు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని భావించే చాలామంది తల్లిదండ్రులు.. పిల్లలకు ఆసక్తి ఉన్నా.. ఆటల వైపు అంతగా ప్రోత్సహించరు. అవిఘ్న తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారంటున్నారు కోచ్. చిన్న వయస్సులోనే 200 పైగా పతకాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది అవిఘ్న. విదేశీ గడ్డపై ఉంటున్నా.. ప్రపంచ వేదికపై మువ్వన్నల జెండా గర్వంగా ఎగరడం కోసం కష్టపడుతున్న ఈ అమ్మాయి కలలు నిజమవ్వాలని మనమూ ఆశిద్దాం.