The police stopped the ambulance: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు మామిడితోటలో తమ ఇల్లు పడగొట్టి, చిత్రహింసలకు గురిచేశారంటూ.. వైఎస్సార్సీపీ నాయకుల వేధింపులతో తల్లీ కొడుకులు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ తల్లి కామాక్షి బుధవారం చనిపోగా... కుమారుడు మురళీకృష్ణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గురువారం మధ్యాహ్నం కామాక్షి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తిచేసి వాహనంలో తరలించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల 15 నిమిషాలకే వాహనం బయలుదేరగా.. వెహికల్ పాస్‌లో ఒంటి గంట పది నిమిషాలు అని నమోదు చేశారు. వాహనాన్ని ఆసుపత్రి బయట మూడున్నర వరకు పోలీసులు నిలిపేశారు.
దీంతో మృతదేహం కోసం గ్రామంలో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. ఎంతకీ పోలీసులు తీసుకురాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులతో కలిసి కుటుంబ సభ్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు.. తొలగించిన ఇంటి స్థలం వద్ద ఆందోళనకు దిగారు. తెదేపా, జనసేన నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి.. కుటుంబ సభ్యుల్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు.
అనంతరం పెద్దకుమారుడు దుర్గా ప్రసాద్ నివాసం వద్దకు కుటుంబ సభ్యుల్ని పంపించిన పోలీసులు మృతదేహాన్ని బిక్కవోలు రైల్వేస్టేషన్ వద్దకు మహాప్రస్థానం వాహనంలో తీసుకొచ్చారు. కామాక్షి చనిపోయిన స్థలం వద్దకు కాకుండా.. మృతదేహాన్ని అక్కడికి తీసుకు రావడమేంటని పోలీసుల్ని కుటుంబ సభ్యులు నిలదీశారు. మృతదేహాన్ని వాహనంలో నుంచి తీసుకోలేదు. గంట సేపు వేచి చూసిన పోలీసులు అనపర్తి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెల్ఫీ వీడియోలో నిందితుల పేర్లు బాధితులు చెప్పినా.. కనీసం ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసుల్ని ప్రశ్నించారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి కనీసం బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.