Viveka Murder Case: వివేకా హత్య కేసు పాత్రధారులు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్లు ఇప్పుడు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలు అన్నారు. తర్వాత వంతు హత్యకు సూత్రధారులైన జగన్ మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలదేనని ఎమ్మెల్సీ, టీడీపీ నేత బీటెక్ రవి చెప్పారు. గత పరిణామాలను బట్టి.. జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని అంతా భావించారన్నారు. తాజా పరిణామాలతో జగన్, భారతి రెడ్డిలే అసలు సూత్రధారులని స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. అందరికీ ఎలాగైతే నోటీసులిచ్చి సీబీఐ విచారణ చేస్తున్నారో.. జగన్, భారతి రెడ్డిలకు కూడా నోటీసులిచ్చి విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.
తమ సొంత ఫోన్లలో మాట్లాడితే ఎదురయ్యే ఇబ్బందులు, భవిష్యత్తును గమనించే ఆనాడు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ఫోన్ల నుంచి అసలు సూత్రధారులు మాట్లాడారని విమర్శించారు. కోటంరెడ్డి, ఆనంలను చంద్రబాబు ట్రాప్ చేశారని.. అధికారంలో ఉన్న కాకాణి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ నేతలు మండిపడ్డారు. ట్యాపింగ్ సంభాషణ ఇంకొకరికి పంపాలంటే రికార్డింగ్ చేస్తేనే సాధ్యమనే అవగాహన కూడా లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.