ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోర్ట్‌బ్లెయిర్‌లో టీడీపీ ఘనత.. మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్​గా పార్టీ నేత ఎన్నిక - Election of TDP leader as Municipal Chairperson

TDP glory in Port Blair: తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనత సాధించింది. అండమాన్‌- నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్​గా టీడీపీ నేత ఎస్‌ సెల్వి ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఇలాంటి విజయం సాధించడం మొదటిసారి కావడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ- బీజేపీ కూటమి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అభినందనలు తెలిపారు.

TDP glory in Port Blair
TDP glory in Port Blair

By

Published : Mar 15, 2023, 10:04 AM IST

TDP glory in Port Blair: పోర్ట్‌బ్లెయిర్‌ నగరంలో ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌ సెల్వి.. ఛైర్‌పర్సన్‌ పదవికి జరిగిన ఎన్నికలో భాజపా మద్దతుతో విజయం సాధించారు. 24 స్థానాలున్న కౌన్సిల్‌లో ఆమెకు 14 ఓట్లు దక్కాయి. ఆమె గురువారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వెలుపల.. మరో ప్రాంతంలో టీడీపీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌ వంటి కీలకమైన పదవిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి. పోర్ట్‌బ్లెయిర్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని టీడీపీ గెలుచుకోవడంపై నిన్న సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం హర్షం వెలిబుచ్చింది. పోర్ట్‌బ్లెయిర్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఎస్‌ సెల్వికి, అక్కడి పార్టీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.

బీజేపీ - టీడీపీ కూటమి అభివృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుందన్న ప్రజల విశ్వాసానికి ఎస్‌ సెల్వి విజయం నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. ఆమె తన పదవీకాలాన్ని ప్రజాసేవలో విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. పోర్ట్‌బ్లెయిర్‌లో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా హర్షం వెలిబుచ్చారు. పోర్టుబ్లెయిర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ -టీడీపీ కూటమికి అభినందనలు తెలిపారు. పోర్ట్‌బ్లెయిర్‌ ప్రజల అభివృద్ధికి నిబద్ధతతో, అంకితభావంతో చేసిన కృషికి లభించిన ఫలితం ఇదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని అభినందనలు తెలియజేశారు.

జనాభాపరంగా తెలుగువారు మూడో స్థానంలో ఉన్న పోర్ట్‌బ్లెయిర్‌లో టీడీపీ ఎప్పటి నుంచో తన ఉనికి చాటుకుంటోంది. పోర్ట్‌బ్లెయిర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కి 2010లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 4 శాతం ఓట్లు, ఒక సీటు గెలుచుకుంది. అప్పటికింకా టీడీపీ అండమాన్‌-నికోబార్‌ శాఖకు గుర్తింపు రాకపోవడంతో.. పార్టీ గుర్తుపై పోటీ చేయలేకపోయింది. 2015 ఎన్నికలకు వచ్చేసరికి... టీడీపీ అండమాన్‌-నికోబార్‌ శాఖకు గుర్తింపు లభించడంతో.. సైకిల్‌ గుర్తుపై పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు సాధించిన టీడీపీ, రెండు కౌన్సిలర్‌ స్థానాలు గెలుచుకుంది. ‘‘2022లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మళ్లీ రెండు స్థానాలు గెలుచుకుంది. పోర్ట్‌బ్లెయిర్‌లో మొత్తం 24 వార్డులుండగా.. భాజపా 10, కాంగ్రెస్‌ 10, తెదేపా 2 స్థానాలు గెలుచుకున్నాయి. భాజపా తిరుగుబాటు అభ్యర్థి ఒక చోట, డీఎంకే అభ్యర్థి ఒక చోట గెలుపొందారు.

గత ఏడాది ఎన్నికల తర్వాత ఛైర్‌పర్సన్‌ ఎన్నికపై భాజపా.. టీడీపీ ఒక అవగాహనకు వచ్చాయని, పదవిని పంచుకోవాలని నిర్ణయించాయి. దాని ప్రకారం మొదటి సంవత్సరం టీడీపీ మద్దతులో భాజపా ఛైర్‌పర్సన్‌ పదవి గెలుచుకుంది. ఈ ఏడాది భాజపా మద్దతుతో టీడీపీ అభ్యర్థి ఎస్‌.సెల్వి గెలుపొందారు. వచ్చే ఏడాది కూడా టీడీపీ అభ్యర్థే ఛైర్‌పర్సన్‌ అవుతారు. ఒప్పందంలో భాగంగా చివరి రెండు సంవత్సరాలు మళ్లీ భాజపా ఛైర్‌పర్సన్‌ పదవి తీసుకోనుంది. పోర్ట్‌బ్లెయిర్‌ నగర జనాభా సుమారు 1.25 లక్షలు. మున్సిపాలిటీ పరిధి సుమారు 18 చ.కి.మీ.లు. కౌన్సిల్‌ బడ్జెట్‌ సుమారు రూ.45 కోట్లు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో నేరుగా ప్రజల నుంచి ఎన్నికైన 24 మంది కౌన్సిలర్లతో పాటు, ముగ్గురు నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details