Road Accidents in Andhra Pradesh: అందివచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదాలలో మరణించడంతో.. ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ప్రమాదాలలో యువకులే ఎక్కువ మంది ఉన్నారు. ఓ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. దీనికి కారణం మద్యం సేవించి వాహనం నడపటం, అతివేగమే కారణంగా తెలుస్తోంది.
అంబులెన్స్‌ను ఢీ కొట్టిన.. ద్విచక్ర వాహనం: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సంకటరేవు గ్రామం జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనం.. అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన నల్లి బాలకృష్ణ, చింతా అరుణ్ బోస్‌గా గుర్తించారు. యానంలో మద్యం తాగిన యువకులు ద్విచక్రవాహనంపై యానం నుంచి కాకినాడకి వస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్.. కాకినాడలో రోగులను దింపి తిరిగి యానాంకి వస్తోంది. ఈ సమయంలో ఓ మలుపు వద్ద.. అంబులెన్స్‌ను యువకుల ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి బంధువులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
స్నేహితుడి కోసం వెళ్లి.. మృతి: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు కొమరోలు మండలం రెడ్డి చర్ల గ్రామానికి చెందిన కాశి నాగేశ్వరరావుగా (27) పోలీసులు గుర్తించారు.