ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

arudra case : అయ్యో.. ఆరుద్ర!.. జీజీహెచ్ నుంచి మానసిక వైద్యశాలకు తరలింపు - ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర

arudra case : కరోనా సమయంలో మాస్కులు ఏవని ప్రశ్నించిన నర్సీపట్నానికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చోడని ముద్రవేసి మానసిక వైద్యశాలకు పంపిందీ ప్రభుత్వం. నేడు అదే పరిస్థితి ఆరుద్రకు ఎదురైంది. మంత్రి ఆగడాలపై పోరాడుతున్న ఆమెను కాకినాడ నుంచి విశాఖలో మానసిక వైద్యశాలకు తరలించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 14, 2023, 11:21 AM IST

arudra case : కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేసి.. పిచ్చోడని ముద్రవేయగా.. తాజాగా కాకినాడలోనూ అదే పునరావృతమయ్యింది. బిడ్డను కాపాడుకోవడానికి న్యాయపోరాటం చేస్తున్న కాకినాడ గ్రామీణం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్రమానసిక స్థితి బాగోలేదంటూ పోలీసు బందోబస్తు మధ్య విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించారు. ఆమె మానసిక పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించిన అక్కడి వైద్యులు... మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు వెన్నెముక చికిత్స చేయించాల్సి ఉందని కోరడంతో డిశ్చార్జి చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లు విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

సీఎం దృష్టికి వెళ్లినా స్పందన శూన్యం... ఆరుద్ర.. కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తె సాయిలక్ష్మీచంద్ర శస్త్ర చికిత్స కోసం కొన్నేళ్లుగా సాయం కోరుతున్నారు. సొంత ఇల్లు అమ్మి వైద్యం చేయిద్దామనుకుంటేమంత్రి దన్నుతో ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్న ఆరుద్ర.. తన గోడు విన్నవించుకోవాలని గతేడాది నవంబరు 2న సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఎడమచేతి మణికట్టు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది.

ఆమరణ దీక్ష నుంచి.. మానసిక వైద్యశాలకు... ఆరుద్ర తన కుమార్తెతో కలిసి ఇటీవల కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను విన్నవించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో.. ఈ నెల 7న కలెక్టర్ కార్యాలయం ఎదుటే కుమార్తెతో సహా నిరవధిక దీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఆ రోజు అర్ధరాత్రి దాటాక దీక్షను భగ్నం చేసి తల్లీకూతుళ్లను కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. చికిత్సకు వారు సహకరించకపోవడంతో బలవంతపు వైద్యసేవలకు యత్నించగా.. ఒత్తిడి చేస్తే గొంతు కోసుకుంటానని ఆరుద్ర హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జీజీహెచ్‌లోని వార్డు వద్ద పోలీసులు భారీగా ఉండటంతో మీడియాకు ఫోన్ చేసిన్ ఆరుద్ర.. ‘వెంటనే ఐసీయూ వద్దకు రావాలని కోరింది. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది పాపను ఏం చేస్తారోనని భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు అర్ధరాత్రి దాటాక వైద్యుల కోరిక మేరకు ఎస్కార్ట్‌ సాయంతో విశాఖలోని మానసిక వైద్యశాలకు ఆరుద్ర, ఆమె కుమార్తెను తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఆరుద్ర జీజీహెచ్‌లో చేరినప్పట్నుంచి వైద్యసేవలు అందించడానికి సహకరించడంలేదు. దగ్గరకు వస్తే బ్లేడుతో గొంతు కోసుకుని చచ్చిపోతానని బెదిరించేవారు. జీజీహెచ్‌లో మానసిక వైద్యులు లేకపోవడంతోనే కలెక్టర్‌ అనుమతితో విశాఖ మానసిక వైద్యశాలకు పంపాం. ఆరుద్ర కుమార్తె వెన్ను సంబంధిత సమస్యతో బాధపడుతోంది. బిడ్డ బాగోగులు తల్లి చూసుకోవాలి కనుక ఆమెనూ తల్లితోనే పంపించాం. - డాక్టర్‌ హేమలతదేవి, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కాకినాడ

ABOUT THE AUTHOR

...view details