Police Restrictions at Rajahmundry Central Jail :తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాల దృష్ట్యా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ (Chandrababu Interim Bail) మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి విడుదలైన తమ అధినేతను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు జైలు వద్దకు వచ్చారు. దీంతో పోలీసులుభారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధించారు. జైలుకు 3 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టడం దారుణమని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు కూడా ఆంక్షలు ఎందుకని వారు ప్రశ్నించారు. జైలు వద్దకు రాకుండా పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'
TDP Leader Atchannaidu Fires on Police Behavior :రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఆంక్షలు విధించడంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఎప్పుడూలేని ఆంక్షలు విధిస్తున్నారని, చంద్రబాబుకు బెయిల్ రావడంతో తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును 52 రోజులు జైలులో పెట్టారని, ఇప్పుడు బెయిల్ వచ్చి, చంద్రబాబు బయటకు వస్తున్నారని తెలిసిన తర్వాత రాజకీయలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి తమ నాయకుడిని చూసుకుందామని వస్తే, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టారని, సీనియర్ నేతలైన తనపైనే కఠినమైన ఆంక్షలు పెడుతున్నారని, ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు. టీడీపీ కార్యకర్తలను, నాయకులను అణచివేయాలని చూస్తే ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు.