Pawan Kalyan Intimate Meeting With Fishermen: వారాహి యాత్రలో భాగంగా ఆరో రోజు కాకినాడ జిల్లా ఏటిమెుగలో మత్స్యకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మత్స్యకారుల కష్టం, రక్తం, శ్రమ ద్వారా వేల కోట్ల ఆదాయన్ని సమకూర్చుతున్నారని.. వారి ఆదాయాన్ని ముఖ్యమంత్రి ముగ్గురికి కేటాయించేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఇసుకంతా పెద్దిరెడ్డికి చెందిన 3 కంపెనీలకే వెళ్తోందని పవన్ ఆరోపించారు. ఇసుక పేరుతో సంవత్సరానికి సుమారు రూ.10 వేల కోట్లు వస్తుందని.. అదంతా ఒక్కరి వద్దకు వెళ్తోందని పవన్ ఆరోపించారు.
మత్స్యకారుల కోసం అధికారంలో లేకపోయినా అండగా నిలిచామని మీరంతా దృఢంగా ఉంటే మరింత పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సరైన వ్యక్తుల్ని మీరు నమ్మడం లేదని, మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని చెప్పారు. జగన్ వచ్చి తొండంగి మండలంలో దివిస్ సంస్థను సముద్రంలో కలిపేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక వెంటనే రసాయనాల పరిశ్రమల్ని స్థాపించేందుకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. జాలర్లులకు జీవించే హక్కుకు భంగంకలిగినప్పుడు పోరాడాల్సిందేనని చెప్పారు. దిల్లీ పెద్దల వద్ద మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు చెప్పి పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు.
ఏటిమొగ సముద్రతీరంలోపవన్ కల్యాణ్ కు అభిమానం వెల్లువెత్తింది. ఏటిమొగ సముద్ర తీరంలో బోటులో పవన్ పర్యటించారు. పవన్ చూసేందుకు మత్స్యకారులు భారీగా తరలివచ్చారు. బోటులో పయనిస్తూ పవన్ వారికి అభివాదం చేశారు. యువత ఉప్పుటేరులో దూకి పవన్ బోటు ఎక్కి ఆయన్ను హత్తుకునేందుకు పోటీపడ్డారు. మహిళలు బోటులో వచ్చి అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. మత్స్యకారుల అభిమానానికి పవన్ తబ్బిఉబ్బిపోయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ తనకు అండగా నిలిచి ఎన్నికల్లో గెలిపించాలని వారిని అభ్యర్థించారు. ఉపాధి వేటలో తమకు ఎదురవుతున్న రకరకాల సమస్యలు, ప్రభుత్వం నుంచి అండదండలు లేక పడుతున్న పాట్లు మత్స్యకారులు పవన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.
ఏటిమెుగలో జాలర్లతో సమావేశమైన పవన్ కల్యాణ్ 'అధికారమే అంతిమ లక్ష్యమనుకుంటే నేను ఇంతలా కష్టపడక్కర్లేదు. నాకు ఉన్న సామర్థ్యానికి ఏదో పదవి పొందొచ్చు. రాజకీయాల్లో ప్రజలు సరైన వ్యక్తుల్ని నమ్మట్లేదు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలోని ఇసుకంతా పెద్దిరెడ్డికి చెందిన 3 కంపెనీలకే వెళ్తోంది. ఇసుక విలువ సాలీనా రూ.10 వేల కోట్లు.. అదంతా ఒక్కరి వద్దకు వెళ్తోంది. మీ సమస్యలు తీరుస్తానని జగన్ మోసం చేశారు. మీరు నాకు అండగా ఉంటే మీ సమస్యలపై కేంద్ర పెద్దల వద్దకు తీసుకెళ్తా. నేను ఎవరితో కుమ్మక్కవను.. నాకు ఎవరితోనూ కాంట్రాక్టులు లేవు'- పవన్ కల్యాణ్, జనసేన అధినేత