NGT imposes 5 crore fine in AP: పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరిట కాకినాడ శివారు దమ్మాలపేటలో మడ అడవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ధ్వంసం చేయడాన్ని, జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుబట్టింది. సీఆర్‌జెడ్-1ఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని స్పష్టంచేసింది. ప్రభుత్వం అక్కడ చేసిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద 5 కోట్లు 6 నెలల్లోగా చెల్లించాలని పేర్కొంది.
కాకినాడ శివారు దమ్మాలపేట సమీపంలో.. 116 ఎకరాల్లో 4,600 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ సీఆర్‌జెడ్-1ఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలోని... మడ అడవులను వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేయడంపై.. ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. మడ అడవుల ఉనికి, సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం.. అధికార యంత్రాంగం యత్నించొద్దని ఆదేశించింది. ప్రభుత్వం చేసిన విధ్వంసానికి.. మధ్యంతర పరిహారం కింద రూ.5 కోట్లు 6 నెలల్లోగా చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని మడ అడవుల పెంపకం, సంరక్షణకు వెచ్చించాలని.. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి నిర్దేశించింది. ఎంత విస్తీర్ణంలో మడ అడవుల విధ్వంసం జరిగింది? పునరుద్ధరించేందుకు.. ఎంత మొత్తం అవసరమనే అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరిట దమ్మాలపేటలో.. మడ అడవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ధ్వంసం చేసిందని.. విశాఖకు చెందిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన డి.పాల్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఎన్జీటీ నియమించిన సంయుక్త కమిటీ అక్కడ పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగిందని, ఇళ్ల స్థలాల కోసం భూమి చదును పేరిట.. మడ అడవులు, ఇతర వృక్ష సంపదను నాశనం చేశారని తేల్చింది. ఈ నేపథ్యంలో ఐదు కోట్ల పరిహారం విధించిన ఎన్జీటీ, పరిహారం జమైన మూడు నెలల్లోగా ఆ ప్రాంతంలో.. పర్యావరణ పునరుద్ధరణ, పరిరక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని
ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీని ఆదేశించింది. అయిదేళ్లలో 85% మడ అడవులు పునరుద్ధరించాలని, మొత్తం 58 ఎకరాల్లో మడ అడవుల పెంపకం, పరిరక్షణకు ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఎన్జీటీ ఆదేశాలు, సిఫార్సుల అమలు పరిస్థితిపై ఆరు నెలలకోసారి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీసీజెడ్‌ఎంఏ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.