Nara Lokesh on Industries: 'రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంది. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. తద్వారా అక్కడి స్థానికులకు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది. పరిశ్రమలను తీసుకొచ్చి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలు వస్తే గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమను తీసుకొచ్చా. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పరిశ్రమను తరిమేసింది. యువతకు, నిరుద్యోగులకు భరోసానిస్తున్నా అధికారంలోకి రాగానే పరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలు ఇస్తాం.' అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
Yuvagalam Padayatra Updates: టీడీపీ యువనేత నారా చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ఆదివారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. నేటి (218వ రోజూ) పాదయాత్రను ఆయన ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. దీంతో లోకేశ్‌కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకగా, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆయనకు సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన యువనేత తొండంగి మండలం కృష్ణాపురం రోడ్డు కూడలి వద్ద నీట మునిగిన పంటలను పరిశీలించారు. కాలువ దాటి పొలంలోకి వెళ్లి, రైతులతో మాట్లాడారు. రైతులు నిరుత్సాహ పడొద్దని, మరో మూడు నెలలు ఓపిక పడితే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చాక నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఉత్సాహంగా సాగిన లోకేశ్ పాదయాత్ర- అడుగడుగునా నిరాజనం పలికిన యువత, మహిళలు
Lokesh Face to Face with Farmers: శృంగవృక్షంలో సెజ్ రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. కాకినాడ సెజ్ కోసం రైతులు త్యాగాలు చేశారన్న లోకేశ్ ఎన్నికలకు ముందు దాడిశెట్టి రాజా రైతులకు జగన్ హామీలు ఇచ్చి, మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.