Officers Detention in Nagulapalli village : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో హాజరైన అధికారులను వైఎస్సార్సీపీ నాయకుడు వడిశెట్టి నారాయణ రెడ్డి, సర్పంచ్ గౌరీ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు నిర్బంధించారు. తమ సమస్య పరిష్కరించే వరకు అధికారులు విడిచిపెట్టింది లేదని తేల్చి చెప్పారు. సమావేశం జరుగుతున్న భవనం తలుపులు మూసేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక గ్రామంలోని సుమారు 600 పై మందిని ఇళ్ల స్థలాల లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరికి స్థలాలు ఇచ్చేందుకు గ్రామ శివారులో భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ భూముల్లో మెరక పనులు సర్వే రాళ్లు రోడ్లు స్థలాల విభజన వంటి పనులు చేయకుండా హడావుడిగా మాత్రం అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు అధికారులు ఎటువంటి వివరాలు లేకుండా ఖాళీ పట్టాను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అప్పటి నుంచి తమ స్థలాలు తమకు అప్పగించాలని ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు చుట్టూ తిరిగిన పట్టించుకునే పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మిగిలిన గ్రామాల్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకుని గృహ ప్రవేశాలు కూడా చేశారని, తమపై ఎందుకు వింత వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు.
దీంతో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుందని తెలుసుకున్న లబ్ధిదారులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివిన అనంతరం కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారు. ముందు తమ ఇళ్ల స్థలాల విషయం తేల్చిన తర్వాత కార్యక్రమం జరుపుకోవాలని లేదంటే ఒక్క అధికారులు కూడా బయటకు వెళ్ళనివ్వమని హెచ్చరించారు. హాజరైన అధికారులు ఎంత చెప్పినా లబ్ధిదారులు వినలేదు. దీంతో అధికారులు బయటికి వెళ్లే ప్రయత్నం చేయగా మహిళలు వారిని అడ్డుకునే తలుపులు వేసేసారు.