RTC DRIVER TALENT : బరువులు ఎత్తుతూ కఠోర సాధన చేస్తున్న మందపల్లి శ్రీనివాసరావు.. కాకినాడలోని జగన్నాథపురం ఘాటీ సెంటర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాసరావు.. ఏదో ఒక ఘనత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2000 సంవత్సరంలో విజయవాడ విద్యాధరపురం డిపోలో విధుల్లో చేరిన ఆయన.. తాను పనిచేసే సంస్థకు, రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తన శరీరం బలంగా, సౌష్టవంగా ఉండటంతో తొలుత బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టారు. దిగ్గజ ఆటగాళ్ల స్ఫూర్తితో 2004లోనే సాధన ప్రారంభించారు. డ్రైవర్‌గా విధుల్లో పాల్గొంటూనే సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో కఠోర సాధన చేసేవారు. కోచ్‌లు లేకపోయినా.. యూట్యూబ్ వీడియోలు చూసి సాధన చేసేవారు.
"2000వ సంవత్సరంలో జాబ్ వచ్చింది. 2004 నుంచి క్రీడలు మొదలుపెట్టా. జిల్లా, రాష్ట్రం, దేశానికి పేరు తేవాలని నా కోరిక. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నా మైండ్‌లో ఎలాగైనా పథకాలు తేవాలనే ఒకటే ఉండేది. అప్పుడే కచ్చితంగా గెలవాలని నిర్ణయించుకున్నా. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్‌లో కోచ్‌లు ఎవరూ లేరు. కేవలం యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా"-మందపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్, కాకినాడ డిపో
బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో MS రావు విజయాలు సాధించి పతకాలు తెచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇండోర్‌లో జరిగిన 7వ జాతీయ క్రీడల పవర్ లిఫ్టింగ్ మాస్టర్-1 విభాగంలో 405 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించారు. హామర్‌త్రో, డిస్కస్ త్రో, షాట్ ఫుట్ విభాగాల్లోనూ బంగారు, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. నవంబర్‌లో నేపాల్‌లో జరిగిన SBKF 7వ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న MS రావు.. పవర్ లిఫ్టింగ్ 105 కేజీల విభాగంలో ఏకంగా 450 కేజీలు ఎత్తి దేశానికి స్వర్ణ పతకం అందించారు.
"నేను వచ్చే నెలలో వైజాగ్‌లో జాతీయ పోటీలు, ఆ తర్వాత అంతర్జాతీయ పోటీలకు దుబాయ్ వెళ్తాను. నేను కచ్చితంగా పథకం సాధిస్తా. రాష్ట్రానికి, సంస్థకు పేరు తీసుకురావాలని కోరిక ఉంది. అది కచ్చితంగా నెరవేరుస్తా"-మందపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్, కాకినాడ డిపో