Kakinada Arudra Issue: కరోనా సమయంలో.. మాస్కులివ్వండి మహాప్రభో అని గొంతెత్తారు నర్సీపట్నానికి చెందిన వైద్యుడు సుధాకర్.! ఆ తర్వాత అతనిపై.. పిచ్చోడని ముద్రవేశారు. మానసిక వైద్యశాలకు పంపారు. ఇప్పుడాయన మన మధ్యలేరు.
ఇక ఇప్పుడు కాకినాడ జిల్లా రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర! ఈమె కష్టం గురించి తెలియని వారు రాష్ట్రంలో.. ఎవరూ ఉండరేమో. కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తె సాయిలక్ష్మీచంద్ర శస్త్రచికిత్స కోసం ఆమె మొక్కని గుడిలేదు..తిరగని ఆఫీస్‌లేదు. న్యాయం చేయాలంటూ చివరకు.. సీఎం కార్యాలయం వద్దే చెయ్యికోసుకుని.. ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. సుధాకర్ లాగే ఈమెపైనా.. మెంటల్ ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే.. ఎలాగోలా బయటపడి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
Chandrababu on Arudra Issue: ఆరుద్రపై పిచ్చి ముద్ర వేయడం సైకో పాలనకు పరాకాష్ట.. చంద్రబాబు ట్వీట్
అప్పుడు సుధాకర్‌కు జరిగిందే.. ఇప్పుడు ఆరుద్రకూ జరిగింది. ఆరుద్ర తపనంతా కదల్లేని తన కుమార్తె సాయిలక్ష్మీచంద్ర గురించే. అమ్మాయి శస్త్రచికిత్స కోసం సొంత ఇల్లూ అమ్ముదామని ప్రయత్నిచారు. కాకపోతే.. మంత్రి అండతో ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారంటూ ఆరుద్ర గతేడాది నవంబరు 2న సీఎం క్యాంపు కార్యాలయం వద్ద చెయ్యికోసుకున్నారు. ఆ తర్వాత సీఎంఓ అధికారులు ఆరుద్రకు.. అభయమిచ్చారు. అన్నిసమస్యలూ.. పరిష్కరిస్తామని, సాయిలక్ష్మీచంద్ర వైద్యానికీ.. సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇల్లు అమ్ముకోగలిగినా.. తమను వేధించిన వారిని వదిలేశారన్నది ఆరుద్ర ఆవేదన. మాటలతో మభ్యపెట్టారని గ్రహించిన ఆరుద్ర.. ఈ నెల 7న కాకినాడ కలెక్టరేట్ వద్ద కుమార్తెతో సహా నిరవధిక దీక్షకు దిగారు. అదే రోజు.. అర్ధరాత్రి దాటాక పోలీసులు దీక్షను భగ్నం చేశారు. తల్లీ కుమార్తెలను తొలుత కాకినాడ జీజీహెచ్‌కి.. ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలకు బలవంతంగా.. తరలించారు. చికిత్స పేరుతో మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆరుద్ర రోదిస్తున్నారు. ప్రస్తుతం.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.