Jayalakshmi Co Operative Society : అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తాం.. కేవలం 20 నెలల్లో మీ సొమ్ము రెట్టింపు అవుతుందంటూ ప్రచారం చేశారు. జయలక్ష్మీ సొసైటీలో పొదుపు - మీ ప్రగతికి మలుపు అని విశ్రాంత ఉద్యోగుల నుంచి కాకినాడలో భారీగా డిపాజిట్లు సేకరించారు. నిర్వాహకులు నిధుల్ని దారి మళ్లించారు. తరువాత బోర్డు తిప్పేశారు. ఖాతాదారులు మాత్రం డబ్బుల కోసం ఏడాది కాలంగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
ఆరు జిల్లాలు, 29 శాఖలు, 520 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 20 వేల మంది ఖాతాదారులతో కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ది జయలక్ష్మీ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ సంస్థ బోర్డు తిప్పేసి ఏడాది గడిచింది. ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామనే ప్రచారంతో వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడతాయనే ఆశతో సొసైటీలో డబ్బులు దాచుకున్నారు. అయితే సొసైటీ పాలక వర్గం, ఇతర సభ్యులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేయడంతో గత సంవత్సరం ఏప్రిల్‌లో సంస్థ బోర్డు తిప్పేసింది. వృద్ధులైన పొదుపు దారుల్ని నడి రోడ్డున పడేసింది.
డబ్బుల కోసం జయలక్ష్మీ సొసైటీ బాధితులు చేయని ప్రయత్నం లేదు. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మెుర పెట్టుకున్నారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వడ్డీలతో కలిపి సుమారు 523 కోట్ల రూపాయల్ని చెల్లించాల్సి ఉంటే రుణాల రూపంలో సంస్థకు రావాల్సింది 704 కోట్ల రూపాయల వరకు ఉందని బాధితులు చెబుతున్నారు. కేసులున్నా అధికార, రాజకీయ నేతల దన్నుతో యాజమాన్యం కొన్ని ఆస్తులు విక్రయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
జయలక్ష్మీ సొసైటీ కేసును సీబీసీఐడీకి అప్పగించడంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లతో పాటు ఇతర డైరెక్టర్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. సొసైటీ నూతన కమిటీ ఛైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు ఆధ్వర్యంలోని కొత్త పాలక వర్గం రుణ గ్రహీతలకు నోటీసులు ఇస్తూ డిపాజిట్లు వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.