ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDR bonds: టీడీఆర్‌ బాండ్లలో భారీ అక్రమాలు.. కోట్లు దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు

Irregularities in TDR Bonds: రోడ్డు విస్తరణ లేదా ఏదైనా ఇతర నిర్మాణాల కోసం స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారంగా పురపాలక, నగరపాలక సంస్థలు జారీ చేస్తున్న బదిలీకి వీలున్న హక్కు పత్రాల్లో (టీడీఆర్‌ బాండ్లు) భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. స్థలాలు కోల్పోయిన బాధితుల తరఫున రాజకీయ నాయకులు అండగా ఉంటామని చెప్పి.. తెర వెనుక ఉండి అధికారులతో కథ నడుపుతూ కోట్లు దోచుకుంటున్నారు.

Irregularities in TDR Bonds
టీడీఆర్‌ బాండ్లలో భారీ అక్రమాలు.. కోట్లు దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు

By

Published : Jun 25, 2023, 7:52 AM IST

Irregularities in TDR Bonds: రహదారుల విస్తరణ, ఇతర నిర్మాణాల కోసం ప్రైవేటు స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా పుర, నగరపాలక సంస్థలు జారీ చేస్తున్న బదిలీకి వీలున్న హక్కు పత్రాల్లో (టీడీఆర్‌ బాండ్లు) భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్థలాలు కోల్పోయిన బాధితుల తరఫున ప్రజాప్రతినిధులు ప్రేమ ఒలకబోస్తూ తెర వెనుక మంత్రాంగం నడుపుతూ వాటాలు పంచుకుంటున్నారు.

తణుకు..మాస్టర్‌ప్లాన్‌ పరిధిలో లేని, బఫర్‌జోన్‌లో సేకరించిన స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా 1:4 నిష్పత్తిలో తణుకు పురపాలక సంఘం గతేడాది టీడీఆర్‌ బాండ్లు ఇచ్చింది. సేకరించిన స్థలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విలువల ప్రకారం చదరపు గజం ధర రూ 4,500 ఉంది. దీనికి బదులు అక్కడికి 1.40 కి.మీ. దూరంలోని డోర్‌నంబరు 10-13-07లో చదరపు గజం ధర రూ.22 వేలను పరిగణనలోకి తీసుకొని టీడీఆర్‌ బాండ్లు జారీ చేసి బాధితులకు రూ.కోట్లలో అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు.

ఎంపీ సిఫార్సుతో భూమి విలువ ఆకాశంలోకి..కాకినాడ నగరపాలక సంస్థలో టీడీఆర్‌ బాండ్ల జారీలో జరిగింది ఇదే. కన్వర్టబుల్‌ స్టేడియం నిర్మాణానికి స్థలం కోల్పోయినట్లు చెబుతున్న ఆరుగురి పేరుతో ఇచ్చిన టీడీఆర్‌ బాండ్లలో పేర్కొన్న డోర్‌నంబరు 70-15-69లో చదరపు గజం విలువ రూ.18 వేలుగా ఉంటే, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సిఫార్సు చేశారని అదే డోర్‌నంబరులో గజం స్థలం విలువను 25 రోజుల్లో అధికారులు రూ.36 వేలకు పెంచారు. దీంతో టీడీఆర్‌ బాండ్ల విలువ ఒక్కసారిగా రూ 129.25 కోట్లకు పెరిగింది. సామాన్యుడు ఎవరైనా తన డోర్‌నంబరులో విలువ పెంచాలని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదిస్తే.. దానికి సవాలక్ష నిబంధనలు పెడతారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కమిటీ ఆమోదించాలంటూ జాప్యం చేస్తుంటారు. అలాంటిది ఎంపీ సిఫార్సు చేశారని భూమి విలువను అమాంతం పెంచేశారు.

ప్రజాప్రతినిధుల అక్రమ వసూళ్లు..స్థలాలు కోల్పోయిన బాధితులకు జీవోలు 180, 223 ప్రకారం 1:2 నుంచి 1:4 నిష్పత్తిలో నష్టపరిహారం కింద టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాలి. ఇక్కడే ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు. బాధితుల తరఫున రంగంలోకి దిగి అధికారులతో గరిష్ఠంగా 1:4 నిష్పత్తితో టీడీఆర్‌ బాండ్లు జారీ చేయిస్తున్నారు. తణుకు పురపాలక సంఘంలో ఇదే జరిగింది. 1:2కు బదులు 1:4 నిష్పత్తిలో టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారన్నది ప్రధాన అభియోగం.

ప్రజలకు వసతులు కల్పించేందుకు సేకరించే స్థలాలకు 1:4 నిష్పత్తిలో బాండ్లు ఇవ్వాల్సి వచ్చినపుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్న ఆదేశాలున్నా పురపాలక అధికారులు బేఖాతరు చేశారు. ప్రజాప్రతినిధుల అండతో అడ్డగోలుగా వ్యవహరించారు. కాకినాడలో నిబంధనల ప్రకారం 1:4 నిష్పత్తితో బాండ్లు జారీ చేసినా.. అదే డోర్‌నంబరులో గజం ధర రెట్టింపు చేయడం ద్వారా బాధితులకు భారీగా అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. టీడీఆర్‌ బాండ్లు పెద్ద సంఖ్యలో జారీ చేస్తున్న విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల్లో బాధితుల తరఫున ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువగా ఉంటోంది.

ఇదో నకిలీ బాగోతం..విజయవాడలో కొందరు దళారులు నకిలీ టీడీఆర్‌ బాండ్లు విక్రయించి అటు కొనుగోలుదారులను, ఇటు నగరపాలక అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. అపార్టుమెంట్లలో అదనపు అంతస్తు కోసం దళారులు నకిలీ బాండ్లు విక్రయిస్తున్నారు. వీటితో అదనపు ఫ్లోర్లు వేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ కోసం నగరపాలక అధికారులను ఆశ్రయించినప్పుడు వారు పరిశీలించి నకిలీ బాండ్లుగా గుర్తిస్తున్నారు. విజయవాడలో గతేడాది అనేక చోట్ల ఇలాంటి నకిలీ బాండ్లు వెలుగుచూశాయి. దీనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు ఫ్లోర్లు వేసినప్పుడే అధికారులు టీడీఆర్‌ బాండ్లు పరిశీలిస్తే ప్రాథమిక దశలోనే నకిలీలు బయటపడేవి. నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తులు చేసుకునే వరకు అధికారులు ఎందుకు పరిశీలించడం లేదన్నది ప్రశ్న.

ఒకసారి వినియోగించిన బాండ్లే మళ్లీ రెండోసారి..గుంటూరు నగరపాలక సంస్థలో ఒక చోట వాడిన టీడీఆర్‌ బాండ్లను మరోచోట వాడుకున్న బాగోతం ఆడిట్‌శాఖ గుర్తించింది. ఇలా రూ 4.25 కోట్ల విలువ బాండ్లను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒకసారి బాండ్లు వినియోగించుకున్నాక రెండోసారి వాడుకోవడానికి వీల్లేకుండా పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్లానింగ్‌ విభాగంలోని కొందరు ఉద్యోగులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడిపారన్నది అభియోగం.

నగరంలోని కాకాని రోడ్డులో ఒక ప్రాంతాన్ని జాతీయ రహదారికి కలపడానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం కోసం రైతులనుంచి నగరపాలక సంస్థ అధికారులు గతేడాది ఒక రైతు నుంచి సేకరించిన 413 గజాల స్థలానికి పరిహారంగా 1:3 నిష్పత్తిలో టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు. రైతు వాస్తవ సర్వేనంబరులో మార్కెట్‌ విలువ గజం రూ.9 వేలు ఉంది. అధికారులు బాధితులతో కుమ్మక్కై గజం రూ.20 వేల చొప్పున అధిక ధరపై టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details