TDP Senior leader Yanamala Krishnudu comments: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గతకొన్ని రోజులుగా యనమల రామకృష్ణుడికి ఆయన సోదరుడు యనమల కృష్ణుడి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయని సామాజిక మాధ్యమాల వేదికగా తెగ చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్ఠానం తుని నియోజకవర్గ బాధ్యతలను యనమల కృష్ణుడికి అప్పగించకుండా ఆయన సోదరుడు యనమల రామకృష్ణుడి పెద్ద కుమార్తె దివ్యకు అప్పగించడంతో.. యనమల కృష్ణుడు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయన వైసీపీ కండువాను కప్పుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో యనమల కృష్ణుడు ఆ ప్రచారాలపై స్పందించారు. తనకు, తన సోదరుడైన యనమల రామకృష్ణుడికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని, ఇకపై కూడా అదే పార్టీలో కొనసాగుతామని స్పష్టతనిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుని యనమల కృష్ణుడు ఆయన నివాసంలో ఈరోజు కలిశారు. తుని నియోజకవర్గ బాధ్యతలను ఇటీవలే యనమల రామకృష్ణుడి కుమార్తె అయిన యనమల దివ్యకి చంద్రబాబు అప్పగించారు.