High Court on SBI Petition: తుపాను కారణంగా 2020లో కాకినాడ జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు రూ.16.46 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని.. కాకినాడ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. మరో వైపు ఆ సొమ్ములో 50శాతాన్ని వినియోగదారుల కమిషన్ వద్ద జమ చేయాలని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌ను ఆదేశించింది. బ్యాంకు, బీమా సంస్థ పోరులో రైతులు నష్టపోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేసింది.
కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ముఖ్య కార్యనిర్వహణ అధికారి, కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) సీఈవోలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది.
అసలేం జరిగింది: 2020 సంవత్సరంలో పెటా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు రూ.16.64 కోట్ల పరిహారం చెల్లించాలని కాకినాడ వినియోగదారుల కమిషన్ ఈ ఏడాది జనవరి 28న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీ రఘురాం వాదనలు వినిపించారు. పీఎంఎఫ్‌బీవై పథకం ప్రకారం రైతులకు సంబంధించిన ‘బీమా ప్రీమియం’ సొమ్మును సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత కాకినాడ డీసీసీబీపై ఉందన్నారు. రైతులకు రుణాల మంజూరు సమయంలో ప్రీమియం సొమ్మును బ్యాంక్ అధికారులు మినహాయిస్తారన్నారు. బ్యాంక్ తమకు ప్రీమియం సకాలంలో చెల్లించలేదన్నారు.
ఈ నేపథ్యంలో బ్యాంకే రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. బీమా చట్ట నిబంధనల ప్రకారం ప్రీమియం చెల్లించకుండా పరిహారం పొందే అర్హత ఉండదన్నారు. ఈ వ్యవహారంలో వినియోగదారుల కమిషన్‌కు పరిహారం చెల్లింపునకు ఆదేశించే అధికార పరిధి లేదన్నారు. కాకినాడ డీసీసీబీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించొద్దన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. సొమ్ము చెల్లించేలా ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌ను ఆదేశించాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కమిషన్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: