Kothapally ZP School: కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 20 రోజులుగా వింత సమస్యతో బాలికలు బాధపడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న ఏడుగురు బాలికలను ఆదివారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య అధికారులు బాలికలకు చికిత్స అందించినా.. సమస్య తగ్గకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం:విషయం తెలుసుకున్న తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినులను పరిశీలించారు. ఏడుగురు బాలికలు శ్వాస తీసుకోవడంలో బాధపడుతుంటే ఒకటే ఆక్సిజన్ కిట్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కిట్టుతో ఒకరి తర్వాత ఒకరికి ఆక్సిజన్ అందిస్తే మిగిలిన వారికి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని వైద్యాధికారులపై మండిపడ్డారు. తక్షణమే బాలికలను కాకినాడ తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో వైద్యాధికారులు రెండు అంబులెన్స్ వాహనంలో తీవ్రంగా బాధపడుతున్న నలుగురు బాలికలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్రంలో అవసరమయ్యే మందులు, సామాగ్రి లేకపోవడంతో ఇది ప్రభుత్వం వైఫల్యమంటూ విమర్శించారు.