Fishermen Protest: ఎన్నో ఏళ్ల నుంచి కాకినాడ కుంభాభిషేకం చేపలరేవు మీదే ఆధారపడి మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఆ స్థలంలో రాత్రికి రాత్రే కంచెలు, నోటీసు బోర్డులు చూసి మత్స్యకారులు ఆగ్రహానికి గురయ్యారు. తమ స్థలంపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నుపడిందని.. ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కంచెలు, బోర్డుల్ని తొలిగించి పోర్టు కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వారికి.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు మద్దతు తెలిపారు.
కాకినాడ కుంభాభిషేకం చేపలరేవు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాతలకాలం నుంచి కుంభాభిషేకం చేపలరేవుపై ఆధారపడి మత్స్యకారులు బతుకుతున్నారు. ఆ స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని... మత్స్యకారులు ఆందోళనకు దిగారు. చెరువు వద్ద వేసిన బోర్డులు, ఫెన్సింగ్ ను మత్స్యకారులు తొలగించారు. బోర్డుల్ని పీకిపారేసి మహిళలు... తమ స్థలంలో.. అధికారులు కంచెలు, బోర్డుల్ని ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆక్రమణను నిరసిస్తూ మత్స్యకారుల కాకినాడ పోర్టు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత్స్యకారులను విచ్ఛిన్నం చేసే కుట్రకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెరదీశారని మండిపడ్డారు. ప్రశ్నించిన వాళ్లను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కోసం కాకుండా తన స్వార్ధం కోసమే ద్వారంపూడి అధికారాన్ని వాడుకుంటున్నాడని... మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించారు. మత్స్యకారుల ఆందోళనకు కొండబాబు మద్దతు తెలిపారు. రేవుని కాపాడాలని మత్స్యకారులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందించారు.