Farmers Facing Troubles Due To Lack Of Water : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి లంక భూముల్లో తీవ్ర సాగు నీటి ఎద్దడి ఏర్పడింది. చొల్లంగి ఆయకట్టు పరిధిలో 300 ఎకరాల్లో 15 రోజుల క్రితం రైతులు వెదజల్లు విధానంలో వరి పంట వేశారు. రబీ సీజన్ ప్రారంభమైనా మరో 50 ఎకరాలకు సాగునీరు అందక దమ్ము చేయకుండా వదిలేశారు. వెద జల్లిన పంటకూ... ప్రస్తుతం నీరు అందడం లేదు. తమ ప్రాంతంలో చుట్టూ నీరు ఉన్నా.. అవి పంట సాగుకు పనికి రావనీ.. ఉప్పుగా ఉంటాయని.. రైతులు దిగులు చెందుతున్నారు.
గోదావరి నుంచి వచ్చే నీరే తమ పంటలకు ఆధారమని చెబుతున్నారు. గొర్రిపూడి ప్రధాన పంట కాల్వ నీటిని.. ఎత్తిపోతల ద్వారా శివారు భూములకు రైతులు తరలిస్తారు. ఎత్తిపోతల పథకం, కాల్వల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల కోసం ధాళ్వలో ఎకరానికి 2 వేల చొప్పున రైతులు డబ్బులు చెల్లిస్తారు. అయినా తమ పంట పొలాలకు సకాలంలో నీరు అందడం లేదని వాపోతున్నారు.
అడవిపూడి కాల్వ నుంచి చొల్లంగి వద్ద ప్రధాన పంట కాల్వకు ఇరు వైపులా నిర్మించిన రక్షణ గోడ కారణంగానే.. శివారు భూములకు సాగు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. నీటి సరఫరా అంగుళం కూడా మించక పోవడంతో.. సాగు కష్టమవుతోందని అంటున్నారు. ఏటా తమకు ఇదే దుస్థితి ఎదురవుతోందని రైతులు వాపోతున్నారు. పంట ప్రారంభంలోనే ఎండి పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు.