ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్యాంలో పుష్కలంగా నీరు.. కానీ పొలాల్లో మాత్రం చుక్క ఉండదు.. ఎవరిదీ నిర్లక్ష్యం..? - lack of water to the crops

FARMERS FACING PROBLEMS DUE TO LACK OF WATER : డివైడింగ్ డ్యాం వద్ద నీరు పుష్కలంగా ఉంటుంది. కానీ పంట కాలవల్లో, పొలాల్లో చుక్క నీరు ఉండదు. పంట చేలన్నీ పైకి పచ్చగా కనిపిస్తాయి. పంట చేలో దిగి చూస్తే నెర్రలు కనిపిస్తాయి. చిరు పొట్ట దశ.. గింజ తోడుకునే సమయంలోను వరి చేలలో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. పరిస్థితులు ఎంతలా ఉన్నా అధికార యంత్రాంగం మాత్రం పాత పాటే పాడుతుంది.

FARMERS PROBLEMS
FARMERS PROBLEMS

By

Published : Mar 13, 2023, 1:54 PM IST

FARMERS FACING PROBLEMS DUE TO LACK OF WATER : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలోని జీ.వేమవరం, పి.మల్లవరం ప్రాంతాల రైతులు వరి పంటకు సాగు నీరు అందక లబోదిబోమంటున్నారు. డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నా.. పంట పొలాలకు అందటం లేదని వాపోతున్నారు. ఇక్కడ సుమారు వంద మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. ఎకరా నుంచి పది ఎకరాలు వరకూ కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే వరకూ వేలల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

తొలకరి పంట పండితే 20 నుంచి 25 బస్తాలు భూస్వామికి.. రెండో పంట పండితే సాగుదారునికి అనేది ఒప్పందం. కానీ రెండు పంటలకు పెట్టుబడి మాత్రం సాగుచేసే వారిదే. భూమినే నమ్ముకున్న రైతులు మరో మార్గం లేక కష్టనష్టాలను భరిస్తూ సాగు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం కూడా వీరికి దక్కడం లేదు. ఎండా, వానలు సైతం లెక్కచేయకుండా కుటుంబం అంతా పగలు, రాత్రి కష్టపడి పంటను కాపాడుకుంటున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి ప్రకృతి ప్రకోపం.. లేదా ప్రభుత్వ అసమర్థతతో తీవ్రంగా నష్టపోతున్నారు.

డ్యాంలో పుష్కలంగా నీరు.. కానీ పొలాల్లో మాత్రం చుక్క ఉండదు.. ఎవరిదీ నిర్లక్ష్యం..?

తాజాగా ముమ్మిడివరంలోని పంట పొలాలను నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పరిశీలించారు. ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో సాగుభూములు బీటలు వాలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసినా.. సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు సైఫాన్ నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుత శాసన సభ్యులు కృషి చేయాలని.. లేకుంటే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం చేపడతామని దాట్ల బుచ్చిబాబు తెలిపారు.

"దాదాపు 30వేల రూపాయల పెట్టుబడులు పెట్టిన పొలాలు నేడు నీరు లేక ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పొలాలకు నీరు అందించాలి. నీరు అందించకపోతే ఎంత అయితే పెట్టుబడి పెట్టిన డబ్బులను రైతులకు చెల్లించాలి. కాల్వలు కూడా బాగుచేయడం లేదు"-దాట్ల బుచ్చిబాబు, టీడీపీ నేత

పంట చేలు చిరు పొట్ట.. గింజ ఏర్పడే దశలో ఉన్నాయని.. ఈ సమయంలో నీరందకుంటే ప్రతి రైతుకు 20 నుంచి 30 వేల రూపాయల వరకు నష్టం వస్తుందని వాపోతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన గురపు డెక్క కూడా తీయడం లేదన్నారు. నెల రోజులుగా అందరి చుట్టూ తిరుగుతున్నామని.. ఎమ్మెల్యే చెప్పినా పని కాలేదని.. వారం రోజులు వంతు అంటున్నారు తప్ప చేలు తడవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెర్రలు వచ్చి చేలు పంట నాశనం అవుతోందని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విన్నవిస్తున్నారు.

"నెల రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. వారం రోజుల వంతు అంటున్నారు కానీ నీళ్లు వదిలిపెట్టడం లేదు. కాలువలు కూడా మేమే బాగు చేసుకుంటున్నాం. జనరేటర్, డీజిల్ మేమే వేసుకుంటున్నాం. ఎకరాకు 40వేలు చొప్పిన పది ఎకరాలకు నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా.. సకాలంలో నీరు లేకపోతే నా పరిస్థితి ఏంటి"-రైతు, ముమ్మడివరం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details