CM KAPU NESTAM:కాపు సామాజికవర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఎన్నికల ప్రణాళికలో చెప్పకపోయినా కాపునేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాదీ అమలు చేసి ఇప్పటివరకూ ఒక్కో మహిళకు రూ.45వేల లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కలెక్టర్ కృతికాశుక్లా అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కాపునేస్తం మూడోవిడత పంపిణీకి ముఖ్యఅతిథిగా హాజరై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాపునేస్తం కింద మొదటి ఏడాది రూ.490 కోట్లు, రెండోదఫా రూ.490 కోట్లు, మిగిలిన అర్హులను గుర్తించి ఈ నెల 19న రూ.1.87 కోట్లు జమ చేశాం. తాజాగా మూడో విడతలో 3,38,792 మందికి రూ.508 కోట్లు లబ్ధి చేకూర్చాం. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో పూర్తి పారదర్శకతతో బటన్ నొక్కి నేరుగా అక్కాచెల్లెళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. మనది డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విధానం. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలకు లంచాలిస్తే తప్ప పనులు జరిగేవి కావు. చంద్రబాబుది డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో) విధానం’ అని విమర్శించారు. ‘ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మనసుతో ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వమిది. ఎవరి వల్ల కుటుంబాలకు మేలు జరుగుతుందనే అంశంపై ప్రజల్లో చర్చ జరగాలి. గత ప్రభుత్వ హయాంలో కాపులకు ఏడాదికి రూ.1,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి మాయ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా చూపిన పద్దులకు, మేలు పొందిన వారికీ పొంతన లేదు. మూడేళ్లుగా కాపునేస్తంలో రూ.1,490 కోట్ల లబ్ధి చేకూర్చాం. ఇతర అన్ని పథకాలూ కలిపి రూ.32,296 కోట్ల లబ్ధి చేకూర్చి చేతల ద్వారా కాపు కాస్తున్నాం’ అని చెప్పారు.
చంద్రబాబు రూ.4వేల పరిహారం.. అబద్ధం:‘గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మ్యానిఫెస్టోలో 10% కూడా అమలు చేయలేదు. మేం రెండు పేజీల మ్యానిఫెస్టో ఇచ్చి 95% అమలు చేస్తున్నాం. మేం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. గతంలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. హుద్‌హుద్ తుపాను సమయంలో బాధితులకు చంద్రబాబు రూ.4వేల పరిహారం ఇచ్చానని అబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర పొట్లాలు, కొందరికి 10 కిలోల బియ్యమే ఇచ్చారు. నేనూ 11 రోజులపాటు ఆ ప్రాంతంలో తిరిగాను. తిత్లీ తుపాను సమయంలోనూ ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు వరదలకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కలెక్టర్లు, జేసీలు గ్రామాల్లో మోహరించి ప్రతి ఇంటికీ అండగా నిలిచారు. రూ.2వేల సాయం అందించాం. చంద్రబాబు పర్యటన సమయంలో ఒక్కరైనా వచ్చి తమకు లబ్ధి అందలేదని చెప్పారా?’ అని ప్రశ్నించారు.