Kakinada woman Arudra: నేను ఉన్నాను... నేను విన్నాను.! ఇదీ కలెక్టర్లకు జగన్ ఇచ్చిన సందేశం. అధికారంలోకి వచ్చాక మొదటిసారి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలుకుని స్పందన కార్యక్రమంపై ఎప్పుడు సమీక్షించినా సార్ ఇదే చెప్తుంటారు. ప్రతీసోమవారం కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితుల గోడు మానవత్వంతో ఆలకించాలని ఉపదేశిస్తుంటారు. ఇవి అధికారులకు చెప్పారు సరే? ఆయన పాటించరా..?
సమస్యలతో వచ్చేవారి నుంచి వినతులు స్వీకరించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని.. ముఖ్యమంత్రే చెబుతున్నారు. అది ఆయన కార్యాలయానికి వర్తించదా..? సీఎం కార్యాలయం సచివాలయం. మంత్రివర్గ సమావేశాలో, అసెంబ్లీ సమావేశాలో ఉంటే తప్ప సార్ ఎలాగూ అటువైపు వెళ్లరు. గతంలో ముఖ్యమంత్రులంతా సచివాలయానికి వెళ్లేవారు. వెసులుబాటును బట్టి ప్రజల గోడు వినేందుకు కొంత సమయం కేటాయించేవారు. వచ్చినవారిని కలిసేవారు. వైద్యంగానీ ఇతరత్రా అవసరాలతో వచ్చినవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అప్పటికప్పుడు ఆర్థిక సాయం మంజూరుచేసేవారు. జగన్ నిత్యం జపించే రాజశేఖర్‌రెడ్డి కూడాసచివాలయానికి వచ్చే ప్రజల నుంచి అర్జీలు తీసుకునేవారు. కానీ రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న రూటే సపరేటు. ఆయనకార్యకలాపాలన్నీ తాడేపల్లి కేంద్రంగానే. పోనీ ఆ క్యాంపు కార్యాలయం వద్దైనా ఎవరినైనా కలుస్తారా అంటే అదీలేదు.
అక్కడైనా జగన్‌కు బదులు... వినతులు స్వీకరించి పరిష్కరించే పటిష్ఠ వ్యవస్థ ఉందా? అంటే లేకేం. కాకపోతే అదో మొక్కుబడి తంతు. సీఎంవో నుంచి ఎవరో ఒక అధికారి వచ్చి వినతులు తీసుకుని,పంపేస్తున్నారు. దానివల్ల బాధితులకు భరోసా దొరకడం లేదు. భరోసా ఉంటే ఆరుద్ర ఎందుకు ఆత్మహత్యాయత్నం చేస్తారు. వెన్నెముకలేని కుమార్తెను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కాకినాడ నుంచి తాడేపల్లికి తీసుకొచ్చిన ఆరుద్ర నిజానికి ఒక రోజంతా సీఎంను కలవాలని ప్రయత్నించారు. కానీ అధికారులు కనికరించలేదు. జగన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు వెళ్లినప్పుడే ఆయనను కలసి గోడు వెళ్లబోసుకునేందుకు ఆమె ప్రయత్నించారు. అక్కడా.. అధికారులు అనుమతించలేదు. జిల్లా కలెక్టరేట్‌కి వెళ్లి స్పందన కార్యక్రమంలో ఆరేడుసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అధికారుల్లో చలనం లేదు. అక్కడే స్పందించి ఉంటే ఇంత జరిగేదా? సర్కార్ స్పందన సరిగా లేకే ఆరుద్రలాంటి ఎందరో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.