Sports Sector Crippled Due to the Neglect: ఉట్టికి ఎగరలేనమ్మ...స్వర్గానికి నిచ్చెనేసిందంటా...అలా ఉంది ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు..రాష్ట్రంలో క్రీడాకారుల కోసం ఒక్కటంటే ఒక్క మైదానం బాగుచేయించలేదు కానీ....రాష్ట్రం నుంచి ఐపీఎల్ టీంను(IPL Team) తయారు చేస్తారంటా. విశాఖలో మరో ఇంటర్నేషనల్ స్టేడియం(International Stadium) ఏర్పాటు, నియోజకవర్గానికొక ఇండోర్ స్టేడియం నిర్మాణం..కడప, తిరుపతి, మంగళగిరిలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయాలంటూ అధికారులను హడావుడి పెట్టారు సరే కానీ...ఇప్పటికే అందుబాటులో ఉన్న, నిర్మాణంలో ఉన్న క్రీడా మైదానాలకు కాస్త ఊతమిస్తే మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయొచ్చన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి జగన్‌కు లేకుండా పోయింది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీయాలంటూ అధికారులకు ఆదేశాలైతే ఇస్తున్నసీఎం జగన్....ఈ నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క స్టేడియం నిర్మాణానికైనా ముందుకు రాలేదు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉందన్న ఏకైక కారణంతోనే మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం పనులు పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలకు మరమ్మతులు చేయించలేని ప్రభుత్వం....నియోజకవర్గానికొక కొత్త ఇండోర్ స్టేడియాలు(Indoor Stadium) నిర్మిస్తామంటూ చెప్పడం హాస్యాస్పదం.
Indira Gandhi Stadium: ఇందిరాగాంధీ స్టేడియంలో మహాయాగం.. ప్రభుత్వ తీరుపై క్రీడాకారుల అసహనం
రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందాలంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి. మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి అత్యుత్తమ శిక్షణ అందించాలి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏమిటీ..గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందించాలి..గతంలో పాటించిన మేలైనా విధానాలేంటి వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం సమీక్షించిన పాపాన పోలేదు. సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం....అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామీణ వికాస కేంద్రాలను పూర్తిచేసినా...క్రీడాకారులకు ఎంతో ఉపయోగంగా ఉండేది. గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో ఉన్న ప్రభుత్వం క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. సుమారు రూ. 391 కోట్ల అంచనాలతో 192 కేంద్రాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయితే, 106 చోట్ల పనులు ప్రారంభించగా.. 39 కేంద్రాలను పూర్తి చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, మిగిలిన పనులకు నిధులివ్వకపోవడంతో ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి. కృష్ణా, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో క్రీడా వికాస భవనాల నిర్మాణం పూర్తి చేసి క్రీడా ప్రాధికార సంస్థలకు అప్పగించినా వీటిని నిర్వహించడం లేదు. క్రీడాకారులకు తగిన సౌకర్యాలు అందించడం లేదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మైదానం పనులు నిలిచిపోయాయి. అరకొర వసతులతోనే క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు.జిల్లాలో ఇచ్ఛాపురం, పలాసలోని మైదానాల పరిస్థితి అలాగే ఉంది.