YSRCP YOUTH LEADER MEERAVALI: గతంలో వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీ నేతలనే విమర్శించారంటూ ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం అధికార పక్ష యువ నేత ఒకరు పార్టీకి విరుద్ధంగా వ్యవహరించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతను చేసిన పనేంటంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడును పొగడటమే..
రాష్ట్రంలో జగన్ పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్న వారు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. 'మూడు రాజధానుల విధానం నచ్చని వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం ఏకంగా చంద్రబాబుకి జై కొడుతున్నారు' అని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఇటీవల ఫ్లైట్ జర్నీ చేస్తూ చంద్రబాబుతో సెల్ఫీ తీసుకోవడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ పరిణామాల అనంతరం వైఎస్సార్సీపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయని మీరావలి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు విజన్ :కేవలం అమరావతి రాజధాని, ఏపీ భవష్యత్ గురించి మాత్రమే చంద్రబాబుతో చర్చించానని అన్నారు. అయితే ఈ విషయంపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం వాట్సప్ గ్రూపుల నుంచి తొలగించారని మీరావలి తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు విజన్ తనకెంతో నచ్చిందని, అందువల్లనే జై చంద్రబాబు అనేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన మీరావలి వైఎస్సార్సీపీలో క్రియాశీల నాయకుడు.