ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్‌ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు - మేరుగు నాగార్జున

వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సీఎం జగన్ తీరు, శైలి పట్ల అసంతృప్తితో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అంతా ఒక్కొక్కరిగా పార్టీ నుంచి దూరమైపోతున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న పార్టీ అధినేత జగన్ నియంతృత్వ పోకడల కారణంగా చివరికి ఒంటరిగా మిగిలిపోతారా?

YSRCP_Politics_in_AP
YSRCP_Politics_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 11:35 AM IST

Updated : Dec 12, 2023, 12:02 PM IST

YSRCP Politics in AP: ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గుర్తించిన వైఎస్సార్సీపీ(YSRCP) అధిష్టానానికి ఓటమి భయం వెంటాడుతోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను తారుమారు చేయటం ద్వారా సానుకూల ఫలితాలు పొందాలనే ఆరాటం మొదలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం(YSRCP Govt) తమ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయకుండా ఆయా నియోజక వర్గాలకు కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి దింపుడు కళ్లం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

హడావుడిగా కొంతమంది ఇంఛార్జుల నియామకం ఆయా నియోజకవర్గాల్లోని సొంత పార్టీ శ్రేణులే నిట్టూర్చే విధంగా ఉన్నాయి. ఒక చోట పనికి రాని సిట్టింగ్ ఎమ్మెల్యేను మరో నియోజకవర్గానికి బదిలీ చేయటం ఏంటని ఆ పార్టీ నాయకులే ఆగ్రహిస్తున్నారు. అధికార వైఎస్సార్సీపీలో 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో ఆ పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాష్ట్రంలోని అధికార వైఎస్సార్సీపీలో భయం పట్టుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీలో మెుదలైన ముస‌లం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా

తెలంగాణలో బీఆర్ఎస్​(BRS) సిట్టింగ్​లకే టికెట్లు ఇచ్చి ఓటమి పాలవడంతో వైఎస్సార్సీపీలో అంతర్మథనం మొదలైంది. తెలంగాణలో నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో భారీ మార్పులకు తెరతీసినట్లు తెలుస్తోంది. మంత్రులు, సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలపై అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో కొందరికి ఉద్వానస పలుకుతుండగా, మరికొందరిని మరో నియోజకవర్గానికి, కొందరినైతే వేరే జిల్లాకే మార్చేస్తున్నారు.

మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే కిమ్ తరహా నిర్ణయాలు
వైనాట్ 175 అంటూ వీర్రవీగిన ముఖ్యమంత్రి, రాత్రికి రాత్రే 11 మంది నియోజకవర్గ బాధ్యులను మార్చడం చర్చనీయాంశంగా మారింది. అందులో ముగ్గురు మంత్రులు ఉండడం గమనార్హం. మరోవైపు ఈ 11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనుక డబ్బు, లాబీయింగ్‌ గట్టిగా పనిచేసిందని ప్రచారం సాగుతోంది. ఒక్కొక్కరికి సంబంధం లేని నియోజకవర్గాలకు, మరి కొంత మందిని జిల్లాలు దాటించి మరీ బాధ్యులను చేయడం అందుకు నిదర్శనమని అసంతృప్తులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే టికెట్​ వస్తుందనే ఆశతో చాలామంది నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవల్​ వర్క్​ చేసుకుంటున్నవారు ఉన్నారు. సొంత నియోజకవర్గంలోనే గెలవరని భావించిన వారిని పక్క నియోజకవర్గాలకు పంపుతున్నారు. మరి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో సీఎం జగన్​కే తెలియాలి. అప్పుడప్పుడన్నా జనంలో కనిపించే నియోజకవర్గ సమన్వయకర్తలనే ఓడిపోతారని మారిస్తే మరి అసలు జనంలోకి రాని ముఖ్యమంత్రి పరిస్థితిపై ఏంటని సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.

ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి?

వ్యతిరేకత, ఓటమి తప్పదనే, మంత్రులకూ స్థాన చలనం
ఈ మార్పుల్లో ముగ్గురు మంత్రులకు స్థానచలనం కలిగింది. యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేశ్, చిలకలూరిపేటలో విడదల రజిని, వేమూరులో మేరుగు నాగార్జునకు స్థానచలనం కలిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానచలనం కలిగించడం పట్ల మంత్రులు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రూపు రాజకీయాలు
రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బాధ్యులను నియమించడంతో మరో గ్రూపు తయారవుతుందని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గెలుస్తామని ఇప్పటి వరకు ధీమాగా ఉన్న కార్యకర్తలు కొత్త బాధ్యులతో ఎలా సర్దుకు పోవాలో తెలియక, పాత గ్రూపు రాజకీయాలు తట్టుకోలేక ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరోవైపు కొత్తగా నియమితులైన వారికి స్థానికుల నుంచి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. వారికి మద్దతు ఇచ్చేదే లేదంటూ బాహాటంగానే హెచ్చరిస్తున్నారు.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకి కారణం ఏంటి - ఆయన మౌనం దేనికి సంకేతం?

Last Updated : Dec 12, 2023, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details