DSP Transfers Disputes In YSRCP: రాష్ట్రంలో DSPల బదిలీలు అధికార వైసీపీలో మంటలు రాజేశాయి. అత్యంత సీనియర్ మంత్రి నుంచి తొలిసారి ఎన్నికైన MLA వరకూ.. పలువురు ఈ బదిలీలను వ్యతిరేకిస్తున్నారు. కొందరు కొత్తవారిని చేరనివ్వడం లేదు. మరికొందరు.. ఉన్నవారిని రిలీవ్ కానివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బదిలీలపై గందరగోళం నెలకొంది. బదిలీల్లో తమను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు మంత్రులు అనధికారిక చర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో ఒక DSP నియామకంపై ఓ మంత్రి నేరుగా.. DGPతోనే సీరియస్‌గా మాట్లాడినట్లు సమాచారం. కనీస సమాచారం లేకుండా డీఎస్పీని వేయడానికి మీరెవరు? ఇక్కడ పరిస్థితులేంటో తెలుసా? ఇక్కడ రాజకీయాలు చేయాల్సింది మేము, మీ ఇష్టం వచ్చినవాళ్లను వేస్తామంటే ఎలా? అని ఆ మంత్రి గట్టిగానే మాట్లాడినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే ప్రాంతంలో మరో మంత్రి డీఎస్పీగా ఒక అధికారి పేరును ప్రతిపాదించగా.. ఆయన్ను కాదని మరొకరిని పంపారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ మంత్రి.. భోగాపురం, విశాఖలో ముఖ్యమంత్రి పర్యటనలో అంటీముట్టనట్లుగా పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆదోని ASPగా.. ఐపీఎస్ అధికారి అధిరాజ్ సింగ్ రాణాను నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అరగంటకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు నుంచి అక్కడ డీఎస్పీగా ఉన్న వినోద్ కుమారే ఇప్పుడు కొనసాగుతున్నారు.
కర్నూలు జిల్లాలో ఒక డీఎస్పీ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వగా.. ఆయన్ను కాదని మరో వ్యక్తిని డీఎస్పీగా నియమించారు. NTR, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు డీఎస్సీల నియామకంపై కొందరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి అసంతృప్తిగా ఉన్నారు. ఒక డీఎస్పీ పోస్టులో కొత్తగా నియమితులైన అధికారి ఇప్పటివరకూ చేరలేదు.