YSRCP LEADERS SAND MAFIA: "గత ప్రభుత్వ హయాంలో వారంతా కలసి.. దోచుకో, పంచుకో, తినుకో అన్న పద్ధతిలో డీపీటీ స్కీం అమలు చేసేవారు. మన ప్రభుత్వంలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్.. నేరుగా ఇక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు".. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలపైనా, ప్రశ్నించేవారిపైనా... తమది నిప్పులాంటి ప్రభుత్వమని ప్రజల్ని నమ్మించేందుకు పదే పదే చేస్తున్న ప్రచారం. కానీ జగన్ చెబుతున్న డీపీటీ.. దోచుకో.. పంచుకో..తినుకోపై పేటెంట్ రైట్ వైసీపీ నేతలదే.
వందల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి:రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న వందల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ ఇందుకు పరాకాష్ఠ. సీఎం చెబుతున్న డీపీటీని.. వైసీపీ ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు ఎంతో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇసుక వ్యాపారులు, స్థిరాస్తిరంగ నిపుణులు, రవాణాదారులు, అనధికారిక వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం.. వైసీపీ ‘ముఖ్య నేతలు’ జిల్లా సిండికేట్‌ల నుంచి సంవత్సరానికి సుమారు 18వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి.. 765 కోట్ల రూపాయలు కట్టి, మిగతా వేయి 35 కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారు. సీఎం చెబుతున్న డీపీటీని పక్కాగా అమలు చేస్తున్నారు.
దోచుకో..: రాష్ట్ర స్థాయిలో వైసీపీ ‘ముఖ్య నేతలు’ మొత్తం ఇసుక దందాను గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, అత్యంత సన్నిహితులతో సిండికేట్లు ఏర్పాటు చేశారు. వారంతా తవ్వగలిగినంత తవ్వేసి, దోచేసుకుంటున్నారు.
పంచుకో..:వైసీపీ ముఖ్య నేతలు.. జిల్లాల వారీ సిండికేట్ల నుంచి రూ.కోట్లలో అడ్వాన్సులు వసూలు చేశారు. నెలవారీ ఎంత కట్టాలో సిండికేట్లకు లక్ష్యాలు నిర్ణయించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక సిండికేట్ నిర్వహిస్తూ, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రేమ్‌రాజు నుంచే 25 కోట్ల రూపాయలు డిపాజిట్‌గా తీసుకున్నారని, ప్రతి నెలా 21 కోట్లు కట్టాలని టార్గెట్ పెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అత్యధికంగా ఇసుక విక్రయాలు జరిగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 35 కోట్లు, కృష్ణా జిల్లాకు 18 కోట్లు, గుంటూరుకు 17 కోట్లు, శ్రీకాకుళానికి 16 కోట్లు.. ఇలా ప్రతి జిల్లాకు నెలవారీ లక్ష్యాలు విధించారు. జిల్లా స్థాయిలో ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నాయకులు.. ముఖ్య నేతలకు నెలవారీ కట్టాల్సిన డబ్బుతో పాటు, వారు మరింత సంపాదించేందుకు ఆయా జిల్లాల్లోని ఇసుక రేవులకు, ఇంత మొత్తమని ధర నిర్ణయించి స్థానిక వైసీపీ నాయకులకు అప్పగించారు. ఇక వాళ్లు ఎంత తవ్వగలిగితే అంతవరకు ఇసుక తవ్వేస్తున్నారు.
తినుకో..:JPపవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక వ్యాపారాన్ని అప్పగించినప్పుడు సంవత్సరానికి 2కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు ఎంత ఇసుక తవ్వుతున్నారో లెక్కాపత్రం లేదు. వారిని అడ్డుకునేవారుగానీ, అటువైపు చూసేవారు గానీ లేరు. గనులశాఖ, ప్రత్యేక కార్యదళం , పోలీసు యంత్రాంగం.. ఇసుక రేవుల్లో ఏం జరుగుతోందో పట్టించుకోదు. లారీలకు లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నా అడ్డుకునేవారూ లేరు. జిల్లాల నుంచి నెలకు సగటున ముఖ్య నేతలకు నెలకు 150 కోట్ల రూపాయలు కడుతున్నారంటే, జిల్లా స్థాయి సిండికేట్లు నడుపుతున్న, ఇసుక రేవుల్ని నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు.. ఇంకెన్ని కోట్లు తినేస్తున్నారో లెక్క లేదు.
అంతా అనధికారిక దందానే: రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. కానీ రికార్డుల్లో ఇసుక వ్యాపారం చేస్తున్న ప్రధాన గుత్తేదారుగా జేపీ పవర్ వెంచర్స్, ఉపగుత్తేదారుగా టర్న్‌కీ సంస్థల పేర్లే ఉంటాయి. కొనుగోలుదారులకు రసీదులూ ఆ సంస్థల పేరు మీదే ఇస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు, పన్నులు ఆ సంస్థలే కట్టినట్టుగా చూపిస్తారు. కానీ ఆ సంస్థల ప్రతినిధులెవరూ.. ఇసుక వ్యాపారంలో కనిపించరు. వైసీపీ నాయకులే అంతా నడిపిస్తున్నారు.
రాష్ట్రంలో సగటున.. ఏడాదికి 2 కోట్ల టన్నులకు పైగా ఇసుక విక్రయాలు జరుగుతాయని అంచనా వేశారు. టన్నుకు 475రూపాయలు చొప్పున 965కోట్ల రూపాయలు వసూలవుతుందని, దానిలో 765 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించగా, నిర్వహణ ఖర్చుల కింద 128 కోట్ల రూపాయలు పోగా, గుత్తేదారు సంస్థకు ఏడాదికి 72 కోట్ల రూపాయలు మాత్రమే మిగులుతుందని చెప్పారు. కానీ ఎన్ని లక్షల టన్నులు తవ్వారో, ఎంత దోచుకున్నారో లెక్కా పత్రం లేదు.
టర్న్‌కీని పంపేసి, సొంతంగా దందా నడిపితే ఇంకా ఎక్కువ తినేయొచ్చని అధికార పార్టీ ‘ముఖ్య నేతలు’ ఆలోచించారు. నిరుడు ఆగస్టులో టర్న్‌కీ సంస్థను ఉన్నపళంగా తొలగించారు. రేవుల నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇసుక దందా మొత్తం తామే నడిపిస్తూ..రికార్డుల కోసం రెండు సంస్థల్ని ఉపగుత్తేదారులుగా తెరపైకి తెచ్చారు. GST తదితర అధికారిక చెల్లింపుల్లో సమస్యలు తలెత్తడంతో ఉపగుత్తేదారుగా మళ్లీ టర్న్‌కీని రంగంలోకి దించారు.
రోడ్డు పక్కన బడ్డీకొట్టులో పది రూపాయల టీ తాగినా ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న ఈ రోజుల్లో.. కోట్లలో జరుగుతున్న ఇసుక వ్యాపారంలో మాత్రం మొదటి నుంచీ నగదు లావాదేవీలే. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినేయడానికి.. ఇబ్బంది లేకుండా దీన్ని అనుసరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే.. అసలు లెక్కలు తెలిసిపోతాయన్న ఉద్దేశంతోనే రేవుల్లో నగదు తీసుకుని మాత్రమే ఇసుక లోడ్ చేస్తున్నారు. జిల్లాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్న సిండికేట్‌లు ‘ముఖ్య నేతల’కు తాము కట్టాల్సిన మొత్తాన్ని కూడా మూటలు కట్టి నెలలో రెండుసార్లు అప్పగిస్తున్నట్టు ఇసుక వ్యాపారులు చెబుతున్నారు.