అమరావతిలో 250 రోజులుగా జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదని అన్నారు వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అదో రియల్ ఎస్టేట్ ఉద్యమమని, కెమెరా ఉద్యమమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మనుషులు కెమెరాల కోసం చేసే అల్లరిని ఉద్యమం అంటే... ఉద్యమం అన్న పేరుకే అవమానమని చెప్పారు. 85 మంది రాజధాని కోసం చనిపోయారు అనేది కట్టుకథ అని వెల్లడించారు. సాధారణ మరణాలను అమరావతి కోసం ప్రాణ త్యాగాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమం ఇలా ఉంటుందా అని అంబటి ప్రశ్నించారు. అలాగే చంద్రబాబుకు కమ్యూనిస్టులు మద్దతివ్వడాన్ని ఆక్షేపించారు. సీపీఐ కాస్తా చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిందా? అన్నారు.
రాజధానిలో జరిగే ఉద్యమానికి దళితులకు సంబంధం లేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దళితులకు అమరావతిలో 52 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తెదేపా నేతలు కోర్టులో కేసులు వేశారని విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరారు.