YSRCP leaders protest over allotment of MLA seats: రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభం కాకముందే వైఎస్సార్సీపీలో సీట్ల పోరు మొదలైంది. ఒక్కరికి సీటు ఇవ్వలేదంటూ ఆందోళనలు చేస్తుంటే, మరొకరికి టికెట్ కేటాయించకుడదంటూ నిరసనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు అన్నీ జగనన్నే అనుకున్న నేతలకు రోడ్డుపైకి వచ్చేవరకూ తెలియడం లేదు తాము మోసపోయామని. ఈ నేపథ్యంలో పార్టీ మారడమో, లేదా పార్టీ నిర్ణయాలపై నిలదీయడమో చేస్తూ వైఎస్సార్సీపీకి తలపోటుగా మారుతున్నారు.
మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్‌కు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మూకుముడిగా రాజీనామాలు చేస్తామని వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్ల కిరణ్ కుమార్ ఇన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాయకులను పట్టించుకోలేదని వాపోయారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కిరణ్ కుమార్‌కు తప్పా, ఇంకెవరికి ఇచ్చిన తమకు అభ్యంతరం లేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఎవ్వరికి టికెట్ కేటాయించినా అందరం కష్టపడి పనిచేసి గెలిపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వల్ల నష్టపోయి, అవమానపడి, బాధపడి చివరకు మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు.
'కేశినేని నాని వైసీపీ కోవర్ట్' - 'చంద్రబాబు, లోకేశ్‌ను విమర్శించే స్థాయి లేదు'
అందుకే ఎంపీ పదవికి రాజీనామా: వైఎస్సార్సీపీలో బీసీలకు పదవులు తప్పా, పవర్ లేదని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ అన్నారు. బీసీల మాటలకు విలువే లేదన్న ఆయన, వైఎస్సార్సీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 50 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఇచ్చామంటున్నారే తప్ప, పార్టీలో సామాజిక న్యాయం లేదన్నారు. కర్నూలు చుట్టూ నీరున్నా నిల్వ చేసుకుని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. తన భవిష్యత్ కార్యచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఎంపీ సంజీవ్‌కుమార్ తెలిపారు.
రాజీనామా చేయడం బాధాకరం: బీసీలకు ముఖ్యమంత్రి సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేయడం బాధాకరమని, కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు బివై రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం తమతో కలిసి ఉన్న ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు విచారిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, సీఎం జగన్ బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయించిందని తెలిపారు. బీసీలకు వైఎస్సార్సీపీలో న్యాయం జరగడం లేదని ఎంపీ చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా డాక్టర్ సంజీవ్‌కుమార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ - ఎన్నికల్లో ఓటేసేదే లేదన్న గ్రామస్థులు