YSRCP Leaders Eye on Kodiguddu Satram Hostel: గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం సమీపంలో ఉన్న కోడిగుడ్డు సత్రం.. ఒకప్పుడు వందలాది విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చింది. నగరంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువు కోసం వచ్చే ఎందరో బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు ఇక్కడ వసతి కల్పించేవారు. అప్పట్లో దీనిని కోడిగుడ్డు సత్రంగా పిలిచేవారు.
భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్తవాటిని నిర్మించేందుకు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలోను పనులు కొనసాగాయి. విద్యార్థులకు అవసరమైన గదులు, డైనింగ్ హాళ్లు, వంటగది, లైబ్రరీ భవనం వంటి నిర్మాణాలను 90 శాతం పూర్తి చేశారు. రంగులు వేయటం, కొన్ని అంతర్గత పనులు మాత్రమే చేపట్టాల్సి ఉంది. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ దీన్ని గాలికొదిలేసింది. దీంతో భవనాలు నిరుపయోగంగా మారాయి.
నిధులు లేక నిలిచిన రెసిడెన్షియల్ పాఠశాల పనులు.. మరోసారి భూమిపూజ
నాలుగేళ్లుగా భవన నిర్మాణ పనులు అటకెక్కడంతో.. దొరికిందే అదనుగా అధికార పార్టీ నేతలు వీటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాణిజ్యపరంగా ఉన్న డిమాండ్ ను ఎలా అయినా సొమ్ముచేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భవనాల్ని స్వచ్ఛంద సంస్థకు కేటాయించాలని కొందరు, షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చి వ్యాపారాల కోసం వినియోగించుకోవాలని మరికొందరు.. స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నారు.
మరోవైపు ఈ సత్రాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం వసతి గృహం కోసం మాత్రమే ఈ భవనాల్ని ఉపయోగించాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎందరో పేద విద్యార్థులకు వసతి కల్పించిన ఈ కోడిగుడ్డు సత్రం సంక్షేమ శాఖ పరిధిలో ఉంటుంది. కోట్ల విలువ చేసే ఈ సత్రాన్ని తమ స్వలాభం కోసం వాడుకోవాలని అధికార పార్టీ నేతలు పన్నిన పన్నాగం.. విద్యార్థి, దళిత సంఘాల నాయకులకు తెలియడంతో అప్రమత్తమయ్యారు.