YSRCP Illegal Cases Against Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసుల నమోదు విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్ పాలనకు తెగబడింది. ఏదైనా నేరం జరిగితే, ప్రాథమిక విచారణ చేయడం, ఆధారాలు సేకరించడం, నిందితుడి పాత్ర ఉందని తేలితే నోటీసు ఇవ్వడం, వివరణ కోరడం, చట్టబద్ధంగా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవడం, ఆ తర్వాత కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం రివాజు.
చంద్రబాబు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అందుకు భిన్నంగా వ్యవహరించింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల్లో సాక్ష్యం సేకరించాల్సి ఉందని, ఆయన పాత్రను తేల్చాల్సి ఉందని హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ జరపకుండా నోటీసు ఇచ్చి వివరణ కోరకుండా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుండా, నేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు వాదించారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవించింది.
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవసరం లేదు - దర్యాప్తు సంస్థలకు హైకోర్టు చురకలు
ప్రతీకార రాజకీయాలు, కక్షసాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ అనే ఆయుధాన్ని ప్రయోగించింది. 6 కేసుల్లో ఇరికించింది. ఇవికాక అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదినేడు పోలీసులు చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు. ఈ 7 కేసుల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందంటూ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కె.అజయ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.
స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ 37వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఈ నెల 19న విచారణ ఉంది. ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ, ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతంరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదైంది. ఇందులో 25వ నిందితుడిగా చేర్చారు.
చంద్రబాబుపై అప్పుడే చర్యలు వద్దు - ఏం చేయాలో మేము చెప్తాం: ఏపీ హైకోర్టు