YSRCP Govt Paying Bills to Only Few Contractors: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు అడ్డేలేకుండా పోయింది. ఆర్థిక సంఘం నిబంధనలు పట్టించుకోదు. కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరాలనూ లెక్క చేయదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (Comptroller and Auditor General) సలహాలన్నా లెక్కలేదు. గతంలో నిర్దేశించుకున్న సంప్రదాయాలూ పాటించదు. అధినేత సైగ చేస్తే.. ఏదైనా సాధ్యమే. ఆయన నిర్దేశిస్తారు. అధికారులు పాటిస్తారు.
అవసరమైతే చట్టాలను మార్చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజకీయ అండదండలున్న 5 బడా సంస్థలకు 2 వేల 650 కోట్ల వరకు బిల్లులు చెల్లించింది. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే. ఈ నాలుగు సంవత్సరాలలో ఇలాంటి పెద్దలకు చెల్లించిన మొత్తంలో సగం నిధులు చిన్న గుత్తేదారులకు చెల్లించినా సగం మంది బిల్లులు క్లియర్ అయ్యేవని అంచనా.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 43 మంది చిన్న, మధ్య తరగతి గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ ప్రకటించింది. వేల మంది చిన్న గుత్తేదారులు బిల్లులు అందక విలవిల్లాడుతోంటే.. జగన్ ప్రభుత్వం ఫిఫో (First In First Out) నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికే చెల్లిస్తోంది. మంత్రుల కంపెనీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువుల కంపెనీలకు, అధినేత సన్నిహిత కంపెనీలకే సొమ్ము అందుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికే కొత్త రూల్ పెట్టిన 'మేఘా' - దేనికైనా సరే సై అంటున్న జగన్ సర్కార్
తాజాగా మేఘా కంపెనీకి కొత్త తరహాలో ప్రయోజనం కల్పించేందుకూ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ కంపెనీ పెండింగ్ బిల్లులకు ప్రభుత్వం గ్యారంటీలు అందిస్తోంది. ఆ బిల్లులు ఎప్పటిలోగా చెల్లిస్తామనేదీ సంబంధిత శాఖల కార్యదర్శులు గ్యారంటీ పత్రాలు ఇస్తున్నారు. వాటిని ఆధారంగా మేఘా కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటోంది. ప్రభుత్వం సొమ్ము ఖాతాలో జమ చేశాక వడ్డీతో కలిపి ఆ సంబంధిత బ్యాంకులు జమ చేసుకుంటాయి.
రాష్ట్రంలో వేల మంది కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కారణంగా.. అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా వారి సంగతి గాలికొదిలేసి ఇలా బడా గుత్తేదారుల ప్రయోజనాలకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. సెప్టెంబరులో వరుస క్రమం తప్పి దాదాపు 650 కోట్ల రూపాయలు బడా రాజకీయ గుత్తేదారులకు చెల్లించింది. ఇవి కాకుండా రాయలసీమ ఎత్తిపోతలలో 739 కోట్లు, తాజాగా బిల్లు డిస్కౌంటింగ్ విధానంలో దాదాపు 13 వందల కోట్లు మేఘా కంపెనీకి చెల్లిస్తోంది.
AP Govt Paid Crores to Monopoly Firm Megha: మేఘాకు కోట్లు సమర్పణ.. దాచిన మెటీరియల్కూ చెల్లింపులు..!
ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహిత కంపెనీగా పేరున్న మేఘా సంస్థ అనేక ప్రయోజనాలు పొందుతోంది. పోలవరం ప్రాజెక్టులో టెండరు వేసిన ఒకే ఒక్క సంస్థగా ఉండి కూడా ఆ పనులు దక్కించుకోగలిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పనులు చేయకుండానే మేఘా జాయింట్ వెంచర్ కంపెనీలకు 739 కోట్లు చెల్లించేశారు.