YSRCP Government Stopped Fees Reimbursement for PG Students :రాష్ట్రంలో విద్యాదీవెన పథకాన్ని (Jagananna Vidya Deevena Scheme) ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రారంభించిన ప్రభుత్వం, దాని అమలులో మాత్రం తడబడుతోంది. 'నేతి బీరకాయ'లో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో 'విద్యా దీవెన'లో భాగంగా ఫీజుల చెల్లింపులపై సీఎం జగన్ (CM Jagan) చెప్పే మాటల్లోనూ అంతే నిజం ఉంటుంది. సకాలంలో ఫీజులు చెల్లించకుండా పేద విద్యార్థులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు అప్పులు చేసి మరీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. కానీ, ఏ సమావేశంలోనైనా 'మీరు పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి వారిని చదివించే బాధ్యతను నేనే తీసుకుంటా'నంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్‌కు ఇవేమీ పట్టడం లేదు. పేద పిల్లల చదువు విషయంలో బటన్ నొక్కేందుకు చేతులెందుకు రావడం లేదో ఆయనకే తెలియాలి.
PG Students Not Eligible to Jagananna Vidya Deevena :ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సాధారణ డిగ్రీ వారికి డిసెంబరుతో మొదటి సెమిస్టర్ ముగుస్తుంది. బీటెక్, బీఫార్మసీ వాళ్లకు జనవరి 18తో మొదటి సెమిస్టర్ పూర్తవుతుంది. ఈ లెక్కన ఏడాదిలో ఇప్పటికే సగం చదువు పూర్తయినట్లు. ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బోధనా రుసుంలు విడుదల చేయలేదు. గత ఏడాది నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫీజులే ఇంకా ఇవ్వకపోవడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారు.
Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక
బటన్ నొక్కినా డబ్బులు జమ కావడానికి సమయం పడుతోంది : గతేడాది ఫీజులే బకాయి ఉండటంతో విద్యాసంస్థలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యా సంవత్సరం ఎక్కడ నష్టపోతామోననే భయంతో కొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ చెల్లిస్తున్నారు. బోధన రుసుముల్లో ఎస్సీ, ఎస్టీలకు కేంద్రమే 60శాతం వరకు చెల్లిస్తోంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటున్న ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించకుండా విద్యాదీవెన కింద మొత్తం తామే చెల్లించినట్లు మాటలు చెబుతోంది. ఒకవేళ బోధన రుసుముల చెల్లింపులకు సంబంధించి జగన్ బటన్ నొక్కినా అవి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేందుకే 15-20 రోజులకుపైగా సమయం పడుతోంది.
విద్యార్థుల ఓట్లపై జగన్ కన్ను : ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను ప్రభుత్వమే నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నందున వాటితో తమకు సంబంధం లేదంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజుల చెల్లింపులనూ జగన్ సర్కారు రాజకీయంగా వాడుకోవాలనుకుంది. దాంతో కళాశాలల ఖాతాల్లో జమ చేసే విధానానికి మార్పులు చేసి, మొదట తల్లుల ఖాతాల్లో వేయడం ప్రారంభించారు. ఇప్పుడు మరో మెట్టు దిగి విద్యార్థుల ఓట్ల కోసం విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోనే పడుతున్నందున ఎప్పుడు పడినా మీరే తీసుకోవచ్చంటూ ఒకవేళ ఇప్పుడు వసూలు చేసుకోకపోతే డబ్బులు పడిన తర్వాత ఇస్తారో లేదోననే అనుమానంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి.