ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠ గంగపాలేనా? - అమరావతి బాండ్లకు వడ్డీల పెండింగ్ - అమరావతి బాండ్లకు వడ్డీ

YSRCP Government on Amaravati Bonds Interest: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. అమరావతి బాండ్ల వడ్డీలను జగన్‌ సర్కార్‌ అందుబాటులో ఉంచలేదు. జనవరి 12 లోపు వడ్డీలు చెల్లించాలని బాండ్ల ట్రస్టీ బ్యాంకరు ప్రభుత్వానికి తాఖీదులు పంపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గ్యారంటీ డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదంలో ఉంది.

YSRCP_Government_on_Amaravati_Bonds_Interest
YSRCP_Government_on_Amaravati_Bonds_Interest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 8:44 AM IST

రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠ గంగపాలేనా? - అమరావతి బాండ్లకు వడ్డీల పెండింగ్

YSRCP Government on Amaravati Bonds Interest :రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠకు ఎన్నడూ లేని మచ్చ పడబోతోందా? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో జారీచేసిన బాండ్లు మార్కెట్‌లో పూర్తిగా డిఫాల్ట్‌ కాబోతున్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదా విభజన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ రాని దుస్థితి అమరావతి బాండ్లకు వచ్చింది. ఈ బాండ్లకు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధులను జగన్‌ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతోంది.

Amaravati Bonds Interest Pending :ఇప్పటికే అమరావతి బాండ్లకు క్రిసిల్‌, అక్యూట్‌ సంస్థలు రేటింగును దారుణంగా తగ్గించేశాయి. అయినా ప్రభుత్వం మేల్కోవడం లేదు. ఈ బాండ్ల ట్రస్టీ బ్యాంకరు ప్రభుత్వానికి ఇప్పటికే తుది నోటీసిచ్చారు. జనవరి 12 లోపు ప్రభుత్వం ఈ బాండ్ల వడ్డీ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాలను డెట్‌ సర్వీసు రిజర్వు ఎకౌంట్‌కు చెల్లించాలి. అంటే జనవరి 11 అర్ధరాత్రికి ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తిచేయాలి. ఇప్పటి వరకు ఆర్థికశాఖలో అలాంటి ప్రయత్నాలు ఏవీ జరిగిన దాఖలాల్లేవు. ఆర్థికశాఖ ఉన్నతాధికారి దృష్టికి ఈ వ్యవహారం చేరలేదని సమాచారం.

అప్పులతో రోడ్డున పడుతున్న పరువు - ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్

గడువులోగా చెల్లింపులు పూర్తి చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను ట్రస్టీ బ్యాంకు ఉపయోగించుకుని వాటి ఆధారంగా తమ నిధులను రాష్ట్ర ఖాతా నుంచి వసూలు చేసి తమ ఖాతాకు బదలాయించాలని రిజర్వు బ్యాంకును కోరుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ డిఫాల్ట్‌ అవుతుంది. అదే జరిగితే రాష్ట్రం పరువు గంగలో కలిసిపోయినట్లే. ఇతర బాండ్ల విషయంలోనూ చెల్లింపులకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే బెవరేజెస్‌ కార్పొరేషన్‌, ఇతర బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు మార్కెట్‌ నుంచి ప్రభుత్వం సమీకరించింది. ఆ బాండ్లు కొన్నవారు భయంతో తమ మొత్తాలు రాబట్టుకునేందుకు ఆందోళన చెందే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే విషయంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని పెట్టుబడులు పెట్టేందుకు, రుణాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు.

ఆర్థికంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లే :చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏ ద్వారా 2000 కోట్లకు అమరావతి బాండ్లు జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ బాండ్లపై వడ్డీ, అసలును సీఆర్‌డీఏ చెల్లించకపోతే తాము చెల్లిస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లు అర్థం. ఈ బాండ్లపై నిరంతరం వడ్డీ చెల్లించేందుకు ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఈ వడ్డీలను డెట్‌సర్వీసు రిజర్వు ఎకౌంట్‌, బాండ్ల సర్వీసింగ్‌ ఎకౌంట్‌ ద్వారా చెల్లించాలి. ఆరు నెలల మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. ఈ నిధుల చెల్లింపుల కోసం డీఎస్‌ఆర్‌ఏలో 300 కోట్లు, బీఎస్‌ఏలో 225 కోట్లు ఉండాలి. ఈ వడ్డీ చెల్లింపులకు తరచు ఇబ్బందులు ఎదురవడం, రాష్ట్రం ఆ నిధులు అందుబాటులో ఉంచకపోవడంతో అమరావతి బాండ్ల రేటింగును రేటింగు సంస్థలూ తగ్గించుకుంటూ వచ్చాయి. అక్యూట్‌ సంస్థ ఏకంగా సి రేటింగుకు తగ్గించింది. అంటే ఆర్థికంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లే. ఆ తర్వాత కూడా జగన్‌ ప్రభుత్వం పరిస్థితులను సరిదిద్దలేదు.

అమరావతి బాండ్ల రేటింగును తగ్గించిన క్రిసిల్​, ఏ ప్లస్‌ నుంచి ఏ మైనస్‌కు

మార్కెట్‌లో అలజడి :2023 డిసెంబరు 31 నాటికి ఈ బాండ్లపై వడ్డీయే 211 కోట్లు చెల్లించాలని సమాచారం. అసలు కూడా చెల్లించాలి. అదీ కలిపితే 372 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అసలు చెల్లింపులకు మరో రెండు నెలల సమయం తీసుకున్నా 211 కోట్లు జనవరి 11 అర్ధరాత్రి లోపు చెల్లించాలి. సాధారణంగా కార్పొరేషన్లు వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లిస్తామంటూ రుణాలు తీసుకుంటాయి. రుణ దాతలు కేవలం కార్పొరేషన్ల కార్యకలాపాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకే ఎక్కువ విలువ ఇస్తాయి. కార్పొరేషన్లకు ఆదాయం లేకపోయినా ప్రభుత్వమే చెల్లించేందుకు హామీ ఇస్తున్నందున తమ నిధులకు ఢోకా లేదనే నమ్మకంతో రుణాలిస్తాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన నిధులు జమ చేయకపోతే అది మార్కెట్‌లో అలజడి రేపుతుంది.

స్పందించని రాష్ట్ర ప్రభుత్వం : ఇదే జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే కేంద్రం ఒకసారి ఇలాంటి కొరడా ఝళిపించింది. రెన్యువల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణాలు సమీకరించింది. తిరిగి చెల్లించడంలో కార్పొరేషన్‌ ఉదాసీనంగా వ్యవహరించింది. కేంద్ర ఇంధన కార్యదర్శి అనేక సార్లు సీఎస్‌కు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్యారంటీ ఆధారంగా రిజర్వు బ్యాంకుకు లేఖ రాసి 230 కోట్లు రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా జమ చేసుకున్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగడంతో బయట పెద్దగా చర్చనీయాంశం కాలేదు. అదే ప్రస్తుతం అమరావతి బాండ్ల విషయంలో ట్రస్టీ అలాంటి అధికారం ఉపయోగిస్తే మార్కెట్‌లో పెను ప్రభావం చూపి రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

'అప్పు' డే.. 2 వేల కోట్ల రుణం తీసుకుంటున్న ప్రభుత్వం, మిగిలింది 2 వేల 457 కోట్లే

ABOUT THE AUTHOR

...view details