YSRCP Government Negligence on AIIB Projects: ప్రతి ఇంటికీ రోజూ తాగునీరు అందించాలని.. 2022 మే 9న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షలో సీఎం జగన్ అన్నారు. మంచి నీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉంటే ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునే వీలుంటుందని ఘనంగా చెప్పారు. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తే జగన్ మాటలు అచ్చంగా నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్టుగా ఉన్నాయి.
తాగునీటి సరఫరా పక్కాగా జరగాలని చెబుతూనే.. అందుకు సంబంధించిన పనులకు నిధుల విడుదలతో తీవ్ర నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న తీరు నిస్సందేహంగా ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగు కోసం చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి.. నాలుగేళ్లలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రం ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. గుత్తేదారులకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.
టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 50 పట్టణాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం.. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టే ఈ ప్రాజెక్టును ఏఐఐబీ (Asian Infrastructure Investment Bank) 2018 డిసెంబరులో ఆమోదించి, ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
మొత్తం నిధుల్లో 70శాతం బ్యాంకు, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం కుదిరింది. మొత్తం 20 ప్రాజెక్టులలో.. 18 తాగునీటి సరఫరా, 2 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటును 2024 జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలోనే పనులు చేపట్టినా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధుల విడుదలలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఇప్పటివరకు ఒక్క పనీ పూర్తికాలేదు.
Water Problem in Guntur: అధికారుల ప్రణాళికా లోపం.. ప్రజలకు శాపం..