YSRCP government Neglects hospitals construction: నాడు-నేడు పేరిట ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నామంటూ ఊదరగొట్టారు. అత్యాధునిక సౌకర్యాలు, కార్పొరేట్ వైద్యమంటూ ఆకాశానికెత్తేశారు. కానీ నాలుగున్నరేళ్లు ఎదురు చూసినా ఏ ఒక్క దవాఖానా పేదలకు అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల పనులే ప్రారంభించ లేదు, కొన్నిచోట్ల అరకొరగా చేసి మధ్యలోనే వదిలేశారు. చచ్చీచెడీ ఒకటీ, రెండు పూర్తి చేసినా, ఆ ఆస్పత్రులను ప్రారంభించడం లేదు. అందుబాటులో కొత్త భవనాలు ఉన్నా రేకుల షెడ్డుల్లోనే రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి.
ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేస్తున్నాం, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తాం, గతంలో, ప్రస్తుతం ఉన్న భవనాలు ఎలా ఉన్నాయో ఫొటోల ద్వారా ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా ఊదరగొట్టేవారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆస్పత్రుల నిర్మాణాలు ఏళ్లతరబడి సాగుతున్నాయి. కొద్దోగొప్ప పూర్తయిన భవనాలను వినియోగించడం లేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు వాటిని అప్పగించడం లేదని తెలుస్తోంది. విద్యుత్ సరఫరా కల్పించకపోవడం వల్ల వైద్య సేవలు అందుబాటులోకి రానికి కొన్నయితే..అధికారులూ, నాయకుల అలసత్వంతో ఆగిపోయినవి మరికొన్ని..ఇరుకైన అద్దె గదుల్లో, పాత భవనాల్లోనే వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. రోగ నిర్థారణ పరీక్షలు చేయలేక, పారా మెడికల్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా లావేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. నాడు-నేడు కింద 1.77 కోట్ల వ్యయంతో 2020 డిసెంబరులో శంకుస్థాపన జరగ్గా.. అతికష్టంపై మూడేళ్లకు పూర్తిచేశారు. గుత్తేదారుకు ఇంకా 70లక్షలు చెల్లించాల్సి ఉండటంతో భవనం అప్పగించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో పాత భవనంలోని చిన్న గదిలోనే వైద్యసేవలు అందిస్తున్నారు. ఒకే గదిలోనే 14 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారు. అక్కడే మందులు ఇవ్వడం, రోగనిర్థారణ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే దీని లోపలకి నీరు ఊరుతుంది. దీనికి ఆనుకుని దుకాణాన్ని తలపించే రేకుల షెడ్డులో రోగులకు చికిత్స అందిస్తున్నారు. గోడలు కూడా లేక.. రైటింగ్ బ్యానర్లను అడ్డంగా పెట్టి.. గదిగా మార్చారు. మండలం పరిధిలోని 14 పంచాయతీలకు చెందిన సుమారు 35వేల మందికి ఈ రేకుల షెడ్డే ఆధారం. ఖరీదైన వైద్య పరికరాలు కాపాడలేకపోతున్నామని వైద్య సిబ్బంది వాపోతున్నారు.
Covid Hospitals: ఆ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు 50 శాతం పడకలు
ఆస్పత్రుల దుస్థితిపై ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చినప్పుడు అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. పల్నాడు జిల్లా విజయపురిసౌత్ కమ్యునిటీ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక చెట్టుకిందే సెలైన్ ఎక్కించడం, గాయలైన వారికి డ్రెస్సింగ్ చేయడం వంటివి ఆరుబయటే చేస్తున్నారు. దీనిపై గతేడాది నవంబర్ 4న ఈనాడులో కథనం రావడంతో అక్కడే నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనాన్ని పూర్తి చేసి డిసెంబరులో ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటికీ చెట్టు కిందనే వైద్యం అందిస్తున్నారు. కొత్త భవనంలో పనులు పూర్తికాకపోవడంతో ఇంకా అందుబాటులోకి రాలేదు.