YSRCP Government Neglecting Guntur Channel Extension: గుంటూరు ఛానల్ పొడిగించి సాగు, తాగు నీరు అందించాలని దశాబ్దాలుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. పాలకులకు పట్టడం లేదు. ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ప్రభుత్వం ఇస్తున్న కంటితుడుపు హామీలతో మభ్యపెడితే ఊరుకునేదే లేదని రైతులు ఉద్యమబాట పట్టారు.
"గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు 250 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేశాము. ఈ పనులకు సర్వే నిర్వహిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో పని పూర్చి చేస్తాం. మిగిలిన పనులను కూడా మాంజూరు చేస్తాం." అని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 2022 జనవరి 1న జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాటిచ్చారు . గుంటూరు వాహిని విస్తరణ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నా.. ఇంతవరకూ పనులే ప్రారంభం కాలేదు. వీటిని త్వరగా ప్రారంభించి 50 గ్రామాలను కాపాడాలని రైతులు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా వారి గోడును పట్టించుకోలేదు.
'గుంటూరు ఛానెల్ పొడిగింపుపై జగన్ మాట తప్పారు' : రైతు సంఘాల ఆగ్రహం, 20న ధర్నా
విధిలేని పరిస్థితుల్లో నల్లమడ రైతు సంఘం నేతలు కలెక్టరేట్ ఎదుట జూన్ 28నుంచి జులై 18 వరకు నిరసన దీక్షలు చేశారు. 20రోజుల తర్వాత దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆగస్టు1న సీఎం జగన్‌ను కలవాలంటూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయల్దేరిన రైతుల్ని.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. చేసేదేమీలేక నవంబరు 20 నుంచి పెదనందిపాడు కేంద్రంగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం దిగొచ్చి ఛానల్‌కు నిధులు మంజూరు చేయాల్సిందేనని రైతులు తేల్చి చెప్తున్నారు.
"ఈ ప్రాంతంలోని 50 గ్రామాల చిరకాల ఆకాంక్ష ఇది. దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇవి రైతాంగ వ్యతిరేక చర్యలు.. దీనికి ప్రజలు చెప్పడానికి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది ." -బాషా, రైతు సంఘం నాయకుడు