ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Disaster Management విపత్తులో.. విపత్తు నిర్వాహణ విభాగం! వరద సహాయక చర్యల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సర్కారు వైఫల్యం! - విపత్తునిర్వహణవ్యవస్థను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

Disaster Management in AP: గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం విపత్తు నిర్వహణను గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోంది.అత్యవసర ప్రతిస్పందన అవసరాన్ని విస్మరించిన ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకు ఉదాహరణగా ప్రస్తుత వరదలు నిలుస్తున్నాయి. సహాయ చర్యలు చేపట్టడంపై ప్రణాళిక లేకపోవటంతో.. నిత్యావసరాలు, ఆహారం, నీరు అందించడంపై విధానమే లేని దుస్థితిని తీసుకువచ్చింది.

Disaster Management in AP
ఏపీ విపత్తు నిర్వహణ

By

Published : Aug 2, 2023, 7:18 AM IST

Updated : Aug 2, 2023, 9:14 AM IST

YSRCP Government Neglecting Disaster Management: విపత్తు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇంటి పక్కన నిర్వహించే కార్యక్రమానికి కూడా గాల్లో ప్రయాణించే ముఖ్యమంత్రి జగన్‌కు.. నేలనే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న ప్రజలు పడే ఇబ్బందులు ఏ మాత్రం పట్టడం లేదు. విపత్తు సమయాల్లో అత్యవసర ప్రతిస్పందన అవసరమనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. సహాయ, పునరావాస చర్యల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కనీసం రాష్ట్ర, జిల్లాల వారీ ప్రణాళికలనూ తయారు చేయడం లేదు. ఇప్పటికీ 2016-17 నాటి ఉమ్మడి జిల్లాల ప్రణాళికలు, అప్పటి పాత సమాచారమే ఇప్పటికీ దిక్కు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటికి కూడా విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలన్న విషయం మరచిపోయింది.

రాష్ట్రంలో తుపాన్లు విరుచుకుపడినా, వరదలు ముంచెత్తినా కనీస సంసిద్ధత అన్నదే లేకుండా పోయింది. బాధితుల్ని ముందే తరలించడం, తగిన సహాయ చర్యలు చేపట్టడం, నిత్యావసరాలు, ఆహారం, నీరు అందించడంపై ఒక విధానమంటూ లేదు. కొత్తగా వచ్చిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు విపత్తు నిర్వహణ వ్యవస్థపై అవగాహన లేకపోవడమే దీనికి కారణం. వరదనీరు తగ్గిన తర్వాత నిత్యావసరాలు ఇస్తామని కొన్నిచోట్ల చెబుతుండటం.. యంత్రాంగం ఎంత సంసిద్ధంగా ఉందో స్పష్టం చేస్తోంది. వరదకు ముందే అప్రమత్తమై చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తవు. వరద ప్రవాహానికి అనుగుణంగా ఏ మండలంలో ఎన్ని ఊళ్లు మునుగుతాయన్న అంచనాలు లేకపోవడంతో మునిగిపోయాక నిత్యావసరాల కోసం కూడా వెతుక్కోవాల్సి వస్తోంది. వారం, పది రోజులుగా బాధితులు వరద ముంపులోనే ఉన్నా.. వారికి కనీసం బియ్యం, పప్పు, కిరోసిన్‌ వంటివి ప్రభుత్వం సరఫరా చేయలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం.

నాలుగేళ్ల కింద విపత్తు నిర్వహణ ప్రణాళికలు: నాలుగు సంవత్సరాల కిందటి వరకు తుపాన్లు, వరదల సమయంలో వరకు.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచాయి. 2016 - 17లో రాష్ట్ర, జిల్లాల వారీ విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో జిల్లా సమగ్ర వివరాలతోపాటు, సహాయ సామగ్రి, అధికారులు, సిబ్బంది ఫోన్‌ నెంబర్లు, వరద తీవ్రతకు గురయ్యే గ్రామాలు, అక్కడి జనాభా వివరాలన్నీ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగరాలకు సంబంధించి కూడా విపత్తు ప్రణాళికలు తయారు చేశారు.

అప్​డేట్​ అవసరం : విపత్తు నిర్వహణ ప్రణాళికలను ఎప్పటికప్పుడు నవీకరించడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాలుగేళ్ల నాటి సమాచారమే ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటై 16 నెలలవుతున్నా.. వాటికి సంబంధించి ప్రణాళికలు లేవు. భారీ వర్షాలు, వరదలపై వాతావరణశాఖ, కేంద్ర జల సంఘం నుంచి సమాచారం అందిన వెంటనే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం జిల్లాల అధికారులూ సిద్ధంగా ఉంచుకోవాలి. అందుకు అనుగుణంగా బాధిత కుటుంబాల తరలింపు, పునరావాస చర్యలు, కొన్ని రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించడం లాంటి ఏర్పాట్లు ఉండాలి.

విపత్తు నిర్వహణ ఇలా : విపత్తు నిర్వహణ ప్రణాళిక, విపత్తు నియంత్రణ - సంసిద్ధత. అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికల పేరిట.. జిల్లాల విపత్తు నిర్వహణ ప్రణాళికల్లో మూడు భాగాలు ఉంటాయి. జిల్లాల వారీగా కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలుగా జరిగిన సంఘటనలు, విపత్తు ప్రభావం, ప్రాణ, ఆస్తి నష్టం, సహాయ చర్యల వివరాలు అందులో పొందుపరుస్తారు. అలాంటి విపత్తు మరోసారి వస్తే ఎలా ప్రతిస్పందించాలనే అవగాహనకు ఇవి ఉపయోగపడతాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇలాంటి సమాచారాన్ని స్వల్ప సమయంలోనే సేకరించవచ్చు. అత్యవసర సమయాల్లో సహాయానికి అవసరమయ్యే అన్ని రకాల సామగ్రి.. ఎక్కడెక్కడ, ఎంతమేర అందుబాటులో ఉందో చిరునామా, ఫోన్‌ నెంబర్లతో సహా పొందుపరుస్తారు. శాఖలు, కార్యాలయాలు, ఫోన్‌ నెంబర్ల వారీగా అగ్నిమాపక ఫోమ్, పాలిథిన్‌ షీట్లు, కంటెయినర్లు, తాళ్లు, గ్యాస్‌ కట్టర్లు, డ్రిల్లింగ్‌ యంత్రాలు, రంపాలు, జాకీలు, క్రేన్లు, పొక్లెయిన్లు.. ఇలా అవసరమైన పరికరాల వివరాలన్నీ నమోదు చేస్తారు.

సమాచారంలో లోపంతో మరింత విపత్తు: విపత్తు సమయంలో అత్యవసర స్పందనకు వీలుగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనే కనీస సమాచారం కూడా ఇప్పుడు జిల్లా అధికారులకు లేదు. వరదలు వచ్చినప్పుడు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. నీరు బయటకు వెళ్లిపోయాక ఆ విషయాన్ని మరచిపోతున్నారు. సమగ్ర ప్రణాళిక తయారీపై దృష్టి పెట్టడం లేదు. గ్రామాలు, పట్టణాల వారీగా కూడా విపత్తు నిర్వహణ ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుంది. శిథిల గృహాలు, భవనాల సమాచారాన్ని సేకరించాలి. తుపాన్లు, గాలుల సమయంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఆ సమాచారమూ లేదు. ఎంత నీటిమట్టం వస్తే ఏ గ్రామానికి నీరు చేరుతుంది, అంతకుముందే వారిని ఏ మార్గంలో తరలించాలి?, ఒక కాలువ ద్వారా వరద నీరు వస్తుందంటే ఏ రోజు, ఎన్ని గ్రామాలకు చేరుతుంది?, అక్కడ ఎన్ని ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడతాయనే సమాచారం ఉండాలి. ఇవేవీ తయారు చేయకపోవడంతో.. గోదావరి జిల్లాల్లో ఏటా లక్షల ఎకరాలు, వందల ఊళ్లు నీటమునుగుతున్నాయి.

ప్రణాళికలు లేక వరదలోనే ప్రజలు: జిల్లాలో తుపాను తాకిడికి గురయ్యే మండలాలు, గ్రామాలు, జనాభా, దగ్గరలోని తుపాను షెల్టర్లు, ఏర్పాట్లు కూడా ప్రణాళికలో భాగమే. నాలుగేళ్లుగా విపత్తు నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో తిరుపతి, కడప, కర్నూలు నగరాలను వరదలు ముంచెత్తాయి. వరద నిర్వహణ సరిగా లేక ప్రజలు రోజుల తరబడి నీటిలో నానాల్సిన దుస్థితి తలెత్తింది. ఇప్పటికీ వాన కురిస్తే చాలు రోడ్లపై అడుగుల్లోతు నీరు చేరుతున్నా ప్రణాళికల రూపకల్పన ఊసే లేదు.

పాఠశాలల్లోనూ అవసరమే: పాఠశాలలల్లోనూ ప్రిన్సిపల్‌ అధ్యక్షతన వివిధ శాఖల ప్రతినిధులతో విపత్తు నిర్వహణ కమిటీ ఉండాలి. అత్యవసర సమయాల్లో విద్యార్థులను తరలించేందుకు స్ట్రెచర్, నిచ్చెనలు, తాడు, టార్చి, ప్రథమ చికిత్స పెట్టె వంటివి అందుబాటులో ఉంచాలి. ఎన్ని పాఠశాలలకు ఇలాంటి ప్రణాళికలు ఉన్నాయంటే ప్రశ్నార్థకమే. జిల్లాల వారీ విపత్తు నిర్వహణ ప్రణాళికల్ని తయారు చేసి ఎప్పటికప్పుడు నవీకరిస్తే.. తర్వాత వచ్చే కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర అధికారులు సత్వరం స్పందించడానికి వీలుంటుంది. వరదలతో రోడ్లు తెగిపోయినా, రాకపోకలు నిలిచినా.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కిరోసిన్‌, బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నిల్వలు ఎక్కడికక్కడ సిద్ధం చేయాలి. నాలుగేళ్లుగా వరదల సమయంలో హడావుడి తప్ప ముందస్తు సంసిద్ధత లేదు.

నాలుగేళ్లుగా విపత్తు నిర్వహణను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం
Last Updated : Aug 2, 2023, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details