RYTHUBANDHU SCHEME STOPPED : అధికార పార్టీ నేతల రాజకీయ ఉపాధి కోసం మార్కెట్ కమిటీలను 191 నుంచి 218కి పెంచిన ప్రభుత్వం.. నాలుగు సంవత్సరాల నుంచి వాటిలో ఒక్క చోటా రైతుకు రుణం ఇవ్వలేదు. మూడు దశాబ్దాల నుంచి నడుస్తున్న రైతు బంధు పథకాన్ని నిలిపేసి, అన్నదాతలను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టింది. మార్కెట్ కమిటీల్లో ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా చేయడం, రైతులు కాకున్నా అధికారపార్టీ వాళ్లయితే పాలకవర్గంలో వేయచ్చన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కనీసం గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకూ అవకాశం లేకుండా చేసింది.
ఉమ్మడి రాష్ట్రం నుంచి రైతుబంధు పథకం అమలవుతోంది. 1982 నుంచి పంట ఉత్పత్తుల తాకట్టుపై రుణం తీసుకునే పథకం ఉన్నా.. దానికి 1995లో రైతుబంధుగా పేరు మార్చారు. ఈ పథకం ద్వారా మార్కెట్ కమిటీ గోదాముల్లో రైతులు నిల్వచేసిన పంట ఉత్పత్తులపై 75శాతం విలువ మేర గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు రుణం ఇస్తారు. దీనిపై 180 రోజుల వరకూ వడ్డీ ఉండదు. 6 నెలల నుంచి 9 నెలల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. విత్తనం వేసే సమయంలో ధరలు అధికంగా ఉన్నా.. పంట చేతికొచ్చే సమయానికి పడిపోతుంటాయి. అప్పుడు పంటను తెగనమ్ముకోకుండా.. మార్కెట్ కమిటీ పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసుకుని దానిపై రుణం తీసుకునే వెసులుబాటు ఈ పథకం ద్వారా లభిస్తుంది. ధర బాగున్నప్పుడు అమ్ముకుని రుణం తీర్చేయొచ్చు. గతంలో రైతులు తమకు దగ్గరలోని మార్కెట్ కమిటీ గోదాముల్లో వరి, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనెగింజల పంటలను నిల్వ చేసి రుణాలు తీసుకునేవారు. ప్రారంభంలో రైతులకు రుణాలు బాగానే ఇచ్చేవారు. తర్వాత మార్కెట్ కమిటీ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లిస్తూ.. కేటాయింపులు తగ్గించారు. 2017-18లో 3,238 మంది రైతులకు 54.08 కోట్లు, 2018-19లో 40.51 కోట్ల రుణం ఇచ్చారు. తర్వాత అసలు అమలే నిలిపేశారు.