MEGA DSC NOTIFICATION : ప్రతిపక్షనేతగా జగన్ ఉన్నప్పుడు 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా కనిపించాయి.. ఆయన అధికారంలోకి రాగానే మాయాజాలం చేసినట్లు అదృశ్యమైపోయాయి. ఇంద్రజాలికులే ఆశ్చర్యపోయేలా పోస్టులను మాయం చేసేశారు. పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఏమైనా నిర్వహించారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఖాళీలు కేవలం 717 మాత్రమే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మరోపక్క జులై, ఆగస్టుల్లో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయనే మరో ప్రకటన చేశారు. జిల్లాల వారీగా ఖాళీలు, అదనపు అవసరాల వివరాలతో నివేదిక రూపొందిస్తామని వెల్లడించారు. ఖాళీలే 717 ఉన్నాయని ప్రకటించిన తరవాత కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి? 717 పోస్టుల భర్తీకే మెగా డీఎస్సీ నిర్వహిస్తారా? అనే సందేహం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
"డీఎస్సీకి సంబంధించి 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపాలి. మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. 23వేల పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకు డీఎస్సీ ఇచ్చారు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ పెడతామని ప్రతి పిల్లవాడికీ చెబుతున్నా"-ప్రతిపక్ష నేతగా జగన్ హామీ
పోస్టులు మింగేసిన మంత్రదండం..ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు కోసమంటూ ప్రపంచ బ్యాంకుతో కలిసి పాఠశాల విద్యాశాఖ ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు రూ.1,862 కోట్లు రుణంగా అందిస్తుంది. ఇందులో భాగంగా అదనపు నియామకాలను కనీస స్థాయిలో ఉంచడం ద్వారా డిపార్ట్‌మెంట్ మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామని ప్రభుత్వమే నిబంధన పెట్టింది. ఇది ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభావం చూపింది. ఈ ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన బదిలీల సమయంలో 15వేల పోస్టులను బ్లాక్ చేసింది. 3-10 తరగతులు ఉన్న బడుల్లో 6,578మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కానున్నట్లు అధికారులు గతంలో లెక్కలు తేల్చారు. ఇప్పుడు వీటిని సర్దుబాటు చేసేశారు.
మాయాజాలం ఇలా
మాయ-1: 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ఒక్కటే అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా.. తెలుగు మాధ్యమం వారిని మిగులుగా తేల్చి వీరిని సర్దుబాటు చేసేశారు. ఒకే మాధ్యమం అమలును ఒక్కో ఏడాది పొడిగించుకుంటూ వచ్చే ఏడాది తొమ్మిది, ఆ తర్వాత పదో తరగతికి అమలు చేయనున్నారు. అంటే భవిష్యత్తులోనూ ఖాళీలు వచ్చే పరిస్థితి లేదు.
మాయ-2:తరగతిలోని సెక్షన్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేశారు. 9, 10 తరగతుల్లో 60మంది వరకు ఒకే సెక్షన్ చేయగా.. 6-8 తరగతులకు 52 మంది వరకు ఒక్కటే సెక్షన్‌గా పెట్టారు.దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది.
మాయ-3:3 నుంచి 10 తరగతులు ఉండే హైస్కూల్‌లో 137మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టును ఇచ్చారు. దీంతో చాలా బడులకు ఈ రెండు పోస్టులు పోయాయి.
మాయ-4: 6-10 తరగతులున్న పాఠశాలలో 92మందికిపైగా పిల్లలు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు. పిల్లలు తక్కువగా ఉన్నచోట పోస్టులు రద్దైపోయాయి.