ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Schools Closing Permanently: మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు.. సాకులు చెబుతున్న సర్కార్​.. - మూతపడుతున్న పాఠశాలలు

Village Schools Closing In AP: రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని, గతంలో మూసేసినవే తెరిపిస్తున్నామని గొప్పలు చెప్పిన సీఎం జగన్‌.. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మరీ పొగబెట్టి వేరే చోటికి పంపిస్తున్నారు. పల్లెబడిని మూసేయిస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త సంస్కరణలతో సర్కారు బడుల్లో విద్యార్థులు సంఖ్య భారీగా తగ్గింది. కొన్ని బడుల్లో అసలు పిల్లలే చేరలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 181 ప్రభుత్వ, 50 ఎయిడెడ్‌ స్కూళ్ల మూతపడ్డాయి.

Village Schools Closing In AP
Village Schools Closing In AP

By

Published : Jul 24, 2023, 8:35 AM IST

రాష్ట్రంలో మూతపడుతున్న పలు ప్రభుత్వ పాఠశాలలు

YSRCP Government Closing Village Schools In AP: ప్రభుత్వం తెచ్చిన నూతన సంస్కరణలతో పాఠశాలల్లో విద్యార్థులు తగ్గారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధన పేరుతో చేసిన హేతుబద్ధీకరణ చాలా పాఠశాలలను చరిత్ర పుటల్లోకి చేరుస్తోంది. 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గి మూతపడ్డాయి. గతేడాది 10 మంది లోపు విద్యార్థులున్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరూ చేరలేదు. ఉన్నవారు వేరే పాఠశాలలకు వెళ్లిపోయారు.

విద్యార్థులు లేరంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 118 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసేసింది. వీటిలో ఒక్క విద్యార్థీ లేరని.. మూసివేతకు అనుమతించాలంటూ మండల విద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరో 50 ఎయిడెడ్‌ పాఠశాలలకూ ఇదే దుస్థితి ఎదురైంది. తరగతుల విలీనాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులతోపాటు 70 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. మంత్రి బొత్సకు లేఖలు రాశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏవో కొన్నింటిని మినహాయించి మిగతావన్నీ విలీనం చేసేశారు. ప్రపంచబ్యాంకు రుణం కోసం మానవవనరుల వ్యయాన్ని తగ్గించుకుంటామన్న నిబంధనతో ఈ దుస్థితి ఏర్పడింది.

విద్యాభివృద్ధికి ఏదో చేస్తున్నట్టు గొప్పలు చెప్పడమే తప్ప పిల్లల అవసరాలను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిన్నారుల ఇంటికి దగ్గరలో బడి ఉంచాల్సింది పోయి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు దూరం చేసేశారు. ఏ రాష్ట్రంలో లేని విధానాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయ పోస్టులు మిగుల్చుకునే స్వార్థంతో పేద పిల్లలను సౌకర్యాలకు దూరం చేశారు. విద్యాహక్కు చట్టానికే సవరణలు చేసేశారు. కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3,4,5 తరగతులను 3 కిలోమీటర్ల దూరం వరకు ఉండేలా సవరణ చేశారు. అంగన్‌వాడీ కేంద్రమూ కిలోమీటరు దూరంలో ఉండొచ్చని సవరించేశారు.

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట ప్రాథమిక పాఠశాల నుంచి గతేడాది 3,4,5 తరగతుల్లోని 21 మంది పిల్లలను సమీపంలోని చినపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. 1, 2 తరగతులు కలిపి 12 మంది విద్యార్థులుండేవారు. ఈ ఏడాది ఇద్దరు సమీప ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిపోగా, మిగిలినవారు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. కొత్తగా ఒకటో తరగతిలో ఎవరూ చేరక పాఠశాల మూతపడింది.

తిరుపతి మంచాల వీధిలోని పురపాలక ప్రాథమిక పాఠశాలలో గతేడాది 3,4,5 తరగతుల్లోని బాలికలను సరోజినీదేవి లేఅవుట్‌లోని పాఠశాలకు, బాలురను అరకిలోమీటరు దూరంలోని ఎస్పీజేఎంఎం పాఠశాలకు తరలించారు. దీంతో 1,2 తరగతుల్లో ఏడుగురు మిగిలారు. ఈ ఏడాది ఉన్న ఏడుగురు ఇతర పాఠశాలలకు వెళ్లిపోవడంతో బడి మూతపడింది. ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కొలుములపేట ఎంపీపీ పాఠశాలలో గతేడాది 25మంది విద్యార్థులు ఉండేవారు. 3,4,5 తరగతులను చింతలచెరువు ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో 1,2 తరగతుల్లో ఐదుగురు మిగిలారు. వీరూ ఈసారి వేరే బడులకు వెళ్లిపోయారు. జూన్‌లో ఒకటో తరగతిలో ఇద్దరే చేరడంతో వీరిని సమీపంలోని ఎంపీపీ బడిలో చేర్పించి బడి మూసేశారు.

పాఠశాలల విలీనంతో గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 73 వేల 416 మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేశారు. వీరిలో అబ్బాయిలు 99వేల 396, అమ్మాయిలు 74వేల 20 మంది ఉన్నారు. బాల్యవివాహాల వల్ల కొందరు బడికి దూరమయ్యారు. సీజనల్‌ వలసల కారణంగా 49వేల 99 మంది బడి మానేశారు. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు చేశామని సీఎం జగన్‌ గొప్పగా చెబుతుండగా... భోజనం సరిగా లేక కొందరు మానేసినట్లు విద్యాశాఖ తన గణాంకాల్లోనే పేర్కొంది. విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఇప్పుడు వీరందరినీ బడిలో చేర్చినట్లు లెక్క చూపిస్తున్నారు.

విద్యలో నిర్దుష్ట విధానాన్ని ఏ ప్రభుత్వమైనా కొంతకాలమైనా అమలు చేస్తుంది. కానీ జగన్ మాత్రం నచ్చిన పోకడపోతున్నారు. గతేడాది సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ సిలబస్‌ తీసుకొస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. గతేడాది బైజూస్‌ కంటెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు దీన్నీ పక్కనపెట్టి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆన్‌లైన్‌ పాఠాలను సిద్ధం చేస్తోంది. ఇది ఉండగానే బెండపూడి విధానమంటూ ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి వదిలేశారు. ఇప్పుడు టోఫెల్‌ అంటూ హడావుడి చేస్తున్నారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌లు, టోఫెల్‌, ఇంటర్నేషనల్‌ సిలబస్‌లు ఎవరి కమీషన్ల కోసం అమలు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. విద్యార్థుల ఉన్నతికే అయితే ఏటా ప్రయోగాలు చేస్తారా అని విద్యా నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

2022 జూన్‌ 28న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ విద్యారంగంలో సంస్కరణల కోసం నాలుగేళ్లలో 66వేల 722 కోట్లు వెచ్చించాం. ప్రైవేటు బడులకు దీటుగా నిలిచే పరిస్థితి మొదటిసారి మన రాష్ట్రంలో వచ్చింది. పెత్తందారీ విధానాన్ని బద్దలుగొట్టాం. ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదల పిల్లలు గొప్ప చదువులకు వెళ్లేలా చేశాం. ప్రభుత్వ బడుల్లో ఆణిముత్యాలు మెండుగా పుట్టే విద్యావిధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వమే అంటూ లేని పోని గొప్పలు పోయారు. కానీ సీఎం ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితికి ఆమడదూరం కనిపిస్తోంది. పాఠశాలల్లో పిల్లల శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

2022 జులై 16న విజయనగరంలో విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పాఠశాలలు మూతపడితే నాదే బాధ్యత అని ప్రకటించారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా ఒక్క పాఠశాల మూతపడినా బాధ్యత వహిస్తానని చెప్పారు. ఇప్పుడు ఇన్ని పాఠశాలలు మూత పడుతున్నా మంత్రి మచ్చుకైనా మాట్లాడడం లేదు.

పెత్తందారీ విధానాన్ని బద్దలుగొట్టడమంటే బడులను మూసేయడమేనా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు బడులతో పోటీ పడడమంటే ప్రాథమిక పాఠశాలలకు తాళాలు వేయడమా అని నిలదీస్తున్నారు. తమ పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేసేందుకేనా 66 వేల కోట్లు వెచ్చిస్తోంది అని ప్రశ్నిస్తున్నారు. మూడోతరగతి నుంచి సబ్జెకు టీచర్‌ అంటూ ప్రాథమిక పాఠశాలల ఉసురు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు తగ్గారని బడులకు తాళాలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక్కరు బడి మూసేసినా తనదే బాధ్యతని చెప్పిన మంత్రి బొత్స ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కేవలం ఒకే ఒక్క హైస్కూలు విద్యార్థిని కోసం జపాన్‌లోని హక్వైడో ఉత్తర ద్వీపంలోని కమీ షిరాటకి రైల్వేస్టేషన్‌ మీదుగా రోజుకు రెండుసార్లు రైలు నడిపారు. మూడేళ్లు ఇలాగే కొనసాగించారు. ఇదీ విద్యకు అక్కడ వారిచ్చే ప్రాధాన్యం. కానీ మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. చదువుకు పిల్లలను దగ్గర చేయాల్సిన ప్రభుత్వం బడులను దూరం చేసిందని విద్యానిపుణులు విమర్శిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details